Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

తలసేమియా రహిత తెలంగాణ సాధిద్దాం:మంత్రి దామోదర్ రాజనర్సింహ

తలసేమియా రహిత తెలంగాణ సాధిద్దాం:మంత్రి దామోదర్ రాజనర్సింహ

తలసేమియా రహిత తెలంగాణ సాధిద్దాం:మంత్రి దామోదర్ రాజనర్సింహ
January 11, 2026 06:58 PM 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

పేషెంట్లకు చికిత్స అందించేందుకు మరో 3 సెంటర్ల ఏర్పాటు

ప్రతి పేషెంట్‌కు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామి.

తెలంగాణను దేశంలోనే మొట్టమొదటి తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. తలసేమియా అండ్ సికిల్‌సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కమల హాస్పిటల్‌లో నిర్వహిస్తున్న ఏసియన్ తలసేమియా కాన్‌క్లేవ్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేషెంట్లు, దేశ, విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు, ఇతర నిపుణులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన నిర్ధారణలు మాత్రమే కావని, అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (మేనరికం) చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిని నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్, కౌన్సిలింగ్, సామాజిక అవగాహన కల్పించడమే సరైన మార్గమని, నివారణే అత్యుత్తమ చికిత్స అని ఆయన పేర్కొన్నారు.

త్వరలో మరో 3 సెంటర్ల ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యాధుల నియంత్రణకు, బాధితుల సంక్షేమానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తలసేమియా, సికిల్‌సెల్ సొసైటీ సహకారంతో మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో విజయవంతంగా ప్రతి గర్భిణీకి పరీక్షలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తలసేమియా బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, త్వరలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లలో అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు.

11 లక్షల మందికి స్క్రీనింగ్

రాష్ట్రంలో సికిల్‌సెల్ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేశామని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నిమ్స్ హాస్పిటల్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

టెస్టులన్నీ ఫ్రీగా చేయిస్తాం

తెలంగాణ హెల్త్ విజన్ 2047లో భాగంగా అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాజనర్సింహ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని గుర్తుచేశారు. టీ-–డయాగ్నోస్టిక్స్ ద్వారా ఉచిత పరీక్షలు చేయిస్తున్నామన్నారు. తలసేమియా, సికిల్‌సెల్‌, హిమోఫీలియా పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల పరీక్షలను డయాగ్నస్టిక్స్ సెంటర్లలో ఉచితంగా చేయిస్తున్నామన్నారు. ఇంకా ఏవైనా టెస్టులు అవసరమైనా ఉచితంగా చేసేందుకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ప్రతి పేషెంట్‌కూ పెన్షన్ అందిస్తాం

నివారించగలిగే వ్యాధులతో ఏ చిన్నారి పుట్టకూడదని, అనారోగ్యం కారణంగా ఏ కుటుంబం పేదరికంలోకి వెళ్లకూడదన్నదే తమ ఆశయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేసి మిషన్ తలసేమియా ఫ్రీ తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోనే తలసేమియా పేషెంట్లు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుదామన్నారు. తలసేమియా, సికిల్ సెల్ పేషెంట్లు అందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News