అపరిశుభ్రత.. గడువు ముగిసిన ఆహార పదార్థాల గుర్తింపు
వలిగొండ: టేకులసోమారం గ్రామంలోని సాధన రూరల్ సెంటర్‌ను రామన్నపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వి. రత్నకుమారి తనిఖీ చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీలో కేంద్రంలోని వసతి, భోజనశాల, వంటగది, మరుగుదొడ్లు, ఆహార పదార్థాలు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు.
అపరిశుభ్రతపై ఆగ్రహం
తనిఖీలో భోజనశాల వద్ద తగినంత వెలుతురు లేకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. వంటకు ఉపయోగించే నీటిని దుమ్ము, ధూళికి గురయ్యే విధంగా నీలిరంగు డ్రమ్ములో నిల్వ చేస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది.
గడువు ముగిసిన ఆహార పదార్థాలు
కేంద్రంలో గడువు ముగిసిన, పురుగులు పట్టిన ఆహార పదార్థాలను గుర్తించి వాటి జాబితాను తయారు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అదే రోజు జిల్లా సంక్షేమ అధికారికి సమాచారం అందించారు. మరుసటి రోజు అధికారుల పర్యవేక్షణలో ఆ పదార్థాలను కేంద్రం నుంచి తొలగించారు.
హాజరు రిజిస్టర్‌లోనూ లోపాలు
సిబ్బంది హాజరు రిజిస్టర్ నిర్వహణలోనూ పలు లోపాలను న్యాయమూర్తి గుర్తించారు. తనిఖీ రోజు హాజరు నమోదు చేయకపోవడం, సెలవు పత్రాలు అందుబాటులో లేకపోవడం, కొత్తగా విధుల్లో చేరిన సిబ్బంది వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
లోపాలు సరిదిద్దాలని ఆదేశం
కేంద్రంలో పారిశుధ్యం, ఆహార భద్రత, సురక్షిత నీటి నిల్వ, తగిన వెలుతురు సౌకర్యాలను మెరుగుపరచాలని న్యాయమూర్తి వి. రత్నకుమారి యాజమాన్యాన్ని ఆదేశించారు. సిబ్బంది హాజరు, సెలవులు, విధుల్లో చేరిన వారి వివరాలకు సంబంధించిన రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి