కాలం మారితే పరిస్థితులూ మారుతాయి
ఒకప్పుడు గ్రామానికి ప్రథమ పౌరుడిగా సర్పంచ్ హోదాలో గ్రామాభివృద్ధి కోసం పనిచేసిన ఆయన.. నేడు అదే చేతులతో పల్లీలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అధికార హోదాలో ఉన్నప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై గ్రామమంతా తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసిన బండమీది చందుపట్ల మాజీ సర్పంచ్ రతి రామ్ నాయక్ ప్రస్తుతం సూర్యాపేట పట్టణంలో పల్లీల వ్యాపారం చేస్తూ కనిపిస్తున్నారు.
ఒకప్పుడు సర్పంచ్.. నేడు చిరు వ్యాపారి
చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన రతి రామ్ నాయక్ తన హయాంలో గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. గ్రామంలో ప్రజలతో మమేకమై తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకునేవారు. సర్పంచ్ హోదాలో ఉన్న సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై గ్రామమంతా తిరుగుతూ పరిపాలన సాగించడం అప్పట్లో ప్రత్యేకంగా కనిపించేది. అయితే కాలచక్రం తిరిగింది. పదవి పోయింది.. పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సూర్యాపేట పట్టణంలో పల్లీలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఒకప్పుడు గ్రామ సమస్యల పరిష్కారం కోసం అధికారులను కలిసిన ఆయన.. నేడు తన జీవనోపాధి కోసం పల్లీల బండి వద్ద కష్టపడుతున్నారు.
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు
మంగళవారం తన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ రతి రామ్ నాయక్ ‘ఓడలు బండ్లు అయితే.. బండ్లు ఓడలు అవుతాయి’ అనే సామెతను గుర్తుచేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమనే వాస్తవాన్ని తన జీవిత అనుభవంతో చాటిచెప్పారు. హోదా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసిన వ్యక్తి.. నేడు తన శ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న తీరు పలువురిని ఆలోచింపజేస్తోంది. పదవి, అధికారం, ఆర్థిక స్థితిగతులు శాశ్వతం కావని.. మనిషికి శ్రమే చివరికి తోడుగా నిలుస్తుందనే సందేశాన్ని ఆయన జీవన ప్రయాణం గుర్తుచేస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి