పోచంపల్లి: అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల పరిధిలోని కెమికల్ పరిశ్రమల వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని తొలగించే వరకు ఐక్యంగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. గురువారం దోతిగూడెం గ్రామంలో సీపీఎం శాఖ సమావేశం అనంతరం నిర్వహించిన కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ ఈ రెండు గ్రామాల పరిధిలోని 11 కెమికల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాలు, విషవాయువుల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆరోపించారు. పంటలు, వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని, పండిన పంటలు, కూరగాయలపై కూడా ప్రభావం పడుతోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలను నిల్వ చేయడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
కాలుష్యాన్ని నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవడం లేదని నర్సింహ విమర్శించారు. పరిశ్రమల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రజల బతుకులు, వ్యవసాయ భూములను కాపాడాలంటే కెమికల్ పరిశ్రమలను ఈ ప్రాంతం నుంచి తొలగించాలని కోరారు. ఈ పోరాటంలో సీపీఎం ముందుండి ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు.
సీపీఎం మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ కెమికల్ పరిశ్రమల వల్ల జల, వాయు కాలుష్యం జరుగుతోందని ఆరోపించారు. నష్టపోయిన రైతులను గుర్తించేందుకు రీసర్వే నిర్వహించాలని, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలుష్య ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అవకాశం కల్పించాలని కోరారు.
అక్టోబర్ 1న పాదయాత్ర.. మహాధర్నా
డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 1న దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల నుంచి చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వరకు వందలాది మందితో పాదయాత్ర నిర్వహించనున్నట్లు రాంచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం మహాధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశానికి సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు ప్రసాదం విష్ణు అధ్యక్షత వహించారు. మాజీ మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, మండల కమిటీ సభ్యుడు కలుకూరి బిక్షపతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి