అద్దె వాహనాల సొమ్ముపై అధికారుల కన్ను?
అధికారుల బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతోనే అద్దె వాహనాల ఒప్పందాలా?
నెలకు రూ.33 వేల చొప్పున చెల్లింపులపై ఆరోపణలు..
డీఎంహెచ్‌వో కార్యాలయంలో వాహనాల అద్దె వ్యవహారంపై నిరుద్యోగ డ్రైవర్ల ఆవేదన..
కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలి..
నల్గొండ : నిరుద్యోగ డ్రైవర్లకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వ అద్దె వాహనాల వ్యవహారంలో నిబంధనలు పక్కన పెట్టి కొందరు అధికారులు తమకు అనుకూలమైన వ్యక్తులు, బంధువుల పేర్లతో వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారనే ఆరోపణలు నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్‌వో) పరిధిలో అద్దె వాహనాల ఒప్పందాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బంధువుల పేర్లతో అగ్రిమెంట్లు?
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు ఉపయోగిస్తున్న కొన్ని అద్దె వాహనాలకు సంబంధించిన ఒప్పందాలు వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో వాహనానికి నెలకు సుమారు రూ.33 వేల వరకు ప్రభుత్వ నిధుల నుంచి చెల్లింపులు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని నిరుద్యోగ డ్రైవర్లు కోరుతున్నారు.
మాజీ డీఎంహెచ్‌వోహయాంలోనూ...
గతంలో నల్గొండ డీఎంహెచ్‌వోగా పనిచేసిన అన్నిమల్ల కొండలరావు హయాంలో ఆయన భార్య పేరుతో సొంత వాహనానికి అద్దె ఒప్పందం అగ్రిమెంట్ పై వివిధ పత్రికలలో వార్త కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనం ఎంపిక ప్రక్రియ ఎలా జరిగింది? టెండర్/కోటేషన్ విధానం పాటించారా? అనే అంశాలపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు.
దేవరకొండ నుంచి కొనసాగుతున్న వ్యవహారమా.!
ప్రస్తుత డీఎంహెచ్‌వో గతంలో దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేసిన సమయంలోనే ఒక బంధువు పేరుతో వాహన అద్దె ఒప్పందం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ అదే వాహనాన్ని వినియోగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన అగ్రిమెంట్లు, వాహన యాజమాన్య వివరాలు, బిల్లులు, చెల్లింపుల రికార్డులు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన దస్త్రాలు అధికారికంగా పరిశీలిస్తేనే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుంది.
వరుస కథనాలు వచ్చినా మారని వైద్యా ఆరోగ్య శాఖ అధికారుల తీరు...
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరుగుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు వ్యవహారాలపై గతంలో వివిధ పత్రికలు, మీడియా సంస్థలు కథనాలు ప్రచురించినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, నిరుద్యోగ డ్రైవర్లకు అవకాశం కల్పించేలా పారదర్శక విధానం అమలు చేయాలని వారు కోరుతున్నారు.
కలెక్టర్ దృష్టి సారించాలి...
ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అద్దె వాహనాల చెల్లింపులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని నిరుద్యోగ డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కుదిరిన అద్దె ఒప్పందాలు, వాహనాల యాజమాన్యం, సంబంధితుల బంధుత్వ వివరాలు, ఎంపిక ప్రక్రియ, నెలవారీ చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. ఈ ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాహుల్ నాయక్ వివరణ కోసం పలు సార్లు ఫోన్ చేయగా స్పందించలేదు..
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి