ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతలో రాజీ లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతలో రాజీ లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో సాగునీటి శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం, వెలిగొండ, హంద్రీ–నీవా, చింతలపూడి ఎత్తిపోతల పథకం తదితర ప్రధాన ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు, శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు చాలా కాలంగా ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర కాలంలో ప్రారంభమైన కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం సరికాదన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక ప్రమాణాలు, నాణ్యత, నివేదికలు, పత్రాల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఎడమ ప్రధాన కాల్వ పనులు మేఘాద్రిగడ్డ వరకు పూర్తి చేయాలని, కుడి ప్రధాన కాల్వలో మిగిలిన పనులను కూడా ఈ సీజన్‌లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డయాఫ్రం గోడ నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతుల విషయంలో ఆలస్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని తెలిపారు.
రాష్ట్రంలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని విడతల వారీగా నిధులు విడుదల చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి