ఓటరు జాబితాల సవరణలో అక్రమాలు అరికట్టాలి
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు యూఎస్‌పీసీ డిమాండ్
నల్లగొండ : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపును అరికట్టలేకపోయారని, అక్రమాలకు తావిచ్చారని విమర్శిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఉపాధ్యాయ పోరాట సంఘాల కమిటీ (యూఎస్‌పీసీ) నాయకులు డిమాండ్ చేశారు. యూఎస్‌పీసీ నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గడియారం సెంటర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా యూఎస్‌పీసీ నాయకుడు నర్రా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని, పేదలు, కార్మికులు, వలస జీవులతో సహా ప్రతీ అర్హుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ఎన్నికల ఫారం-6లో తీసుకొచ్చిన నూతన నిబంధనలను, 2023లో ఎలక్షన్ కమిషనర్లకు రక్షణ కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని, తొలగించినట్లు చెబుతున్న 13 కోట్ల ఓటర్ల అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలనూ బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిష్కరించి, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని సూచించారు.
కార్యక్రమంలో డిటెఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశం, నాగయ్య, వెంకులు, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు రాములు, టీఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, పగళ్ల సైదులుతో పాటు వివిధ మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి