వచ్చే జూలై వరకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి..
తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు..
అధికారుల సమావేశంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశం..
నల్గొండ : రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ ప్రభావం అన్ని రంగాలపై పడే అవకాశం ఉన్నందున, ప్రధాన శాఖలన్నీ వచ్చే జూలై వరకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను తక్షణమే రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. ఎల్ నినో పరిస్థితులపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, రానున్న సోమవారం సీఎం అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించనున్న నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే 270 రోజుల పాటు అధికారులందరూ పూర్తి అప్రమత్తంగా, చురుగ్గా వ్యవహరించాలన్నారు. ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కష్టకాలాన్ని ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు..
ముందున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ముప్పు ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బోర్ల రీఛార్జి, పైప్‌లైన్ల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో రానున్న మూడు నెలల అవసరాలకు తగినట్లుగా కార్యాచరణ రూపొందించాలన్నారు. పట్టణాల్లో ‘అమృత్’ పనులు, స్థానిక నీటి వనరుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పనులు వేగవంతం..
వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి లేకపోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడకుండా విబిజిరామ్ జీ (ఉపాధి హామీ) కింద పెద్ద ఎత్తున పనులు గుర్తించి ప్రారంభించాలని ఆదేశించారు. పనుల కల్పనకు ఎలాంటి పరిమితి లేదని, ప్రతి గ్రామంలోనూ నీటి సంరక్షణ పనులు చేపట్టి శాశ్వత ఆస్తుల సృష్టికి బాటలు వేయాలన్నారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను ఏర్పాటు చేయాలని, పనుల వివరాలను సర్పంచులు, వార్డు మెంబర్లకు ముందుగానే తెలియజేయాలని పేర్కొన్నారు. ఎండిపోయిన బావులు, బోర్ల వద్ద రీఛార్జి నిర్మాణాలు, మ్యాజిక్ సోక్ పిట్లు, ఫామ్ పాండ్లు, పర్కులేషన్ ట్యాంకుల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు.
భూగర్భ జలాలు 2 మీటర్లు పతనం..
జిల్లాలోని 16 మండలాల్లో సరాసరి కంటే తక్కువ భూగర్భ జలాలు ఉన్నాయని, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం నీటిమట్టం 2 మీటర్లు తగ్గినట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నీటిమట్టం పడిపోవడానికి గల కారణాలపై విశ్లేషణ నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. వేసిన పంటలు, ఎండిపోయిన భూముల వివరాలపై వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటి నిల్వలపై నీటిపారుదల శాఖ నివేదిక సమర్పించాలన్నారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా పశుసంవర్ధక శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్ఓ దశరథతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి