తొలి ఏడాది ఫీజు రూ.1.20 లక్షలు అందజేత.. మిగిలిన నాలుగేళ్ల ఫీజు కూడా చెల్లిస్తానని హామీ.
చిట్యాల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బూడిద శేఖర్ కుటుంబానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అండగా నిలిచారు. ఆయన కుమార్తె సాద్విక వైద్య విద్యకు అవసరమైన ఖర్చులను భరిస్తానని ఇచ్చిన హామీ మేరకు, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజు రూ.1.20 లక్షలను అందజేశారు. మిగిలిన నాలుగేళ్ల ఫీజును కూడా తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు.
చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డుకు చెందిన బూడిద శేఖర్ మృతితో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో సాద్విక చదువుకు సహకరిస్తానని ముందుకు వచ్చిన ఎమ్మెల్యే, ఇచ్చిన మాట ప్రకారం ఫీజు అందజేశారు. తన కుమార్తె విన్నుత్న కూడా ఎంబీబీఎస్ చదువుతోందని, వైద్య విద్యకు సంబంధించి సందేహాలున్నా, ఏ సహాయం కావాలన్నా ఆమెను సంప్రదించాలని సాద్వికకు సూచించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే అందించిన సహకారానికి సాద్విక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి