నల్గొండలో గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు..జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్..
ఆటంకాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం..
నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున భద్రతా చర్యలు తప్పనిసరి..
28 నిమజ్జన కేంద్రాల వద్ద భారీ బందోబస్తు, సీసీ కెమెరాలు..
నల్గొండ : ఈ ఏడాది వినాయక ఉత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని నిమజ్జన కేంద్రాలలో పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి రెవెన్యూ, పోలీస్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోమ, మంగళ, బుధవారాల్లో ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశముందన్నారు. ఎల్ నినో ప్రభావంతో ఈసారి చెరువులు, కుంటలు, నదుల్లో తగినంత నీటి వసతి లేనందున, భక్తులు నేరుగా నీట్లోకి దిగి నిమజ్జనం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నీటి లభ్యత లేని చోట ప్రత్యామ్నాయంగా బేబీ పాండ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ దీపాలు, బారికేడింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, క్రేన్లు, మెడికల్ టీమ్‌లతో పాటు మున్సిపల్, పంచాయతీ అధికారులను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. నిర్వాహకులు పూజా సామాగ్రి, చెత్తను నీటిలో వేయకుండా చెత్తబుట్టల్లోనే వేసేలా అవగాహన కల్పించాలన్నారు.
28 కేంద్రాల్లో సీసీ కెమెరాలు, భారీ బందోబస్తు.. ఎస్పీ శరత్ చంద్ర పవార్
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 28 నిమజ్జన ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. శనివారం నాటికే 500 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, రాబోయే మూడు నాలుగు రోజుల్లో భారీగా విగ్రహాలు రానున్నందున గతం కంటే మెరుగైన రీతిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని తహసీల్దార్లు, ఎంపీడీవోలకు సూచించారు. భద్రత కోసం స్థానిక పోలీసులతో పాటు 12వ బెటాలియన్ బలగాలు, ఎస్‌డీఆర్ఎఫ్, ఆపదమిత్ర సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని డివిజన్ మరియు జిల్లా కేంద్రాల్లోని కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. భక్తులు నేరుగా నీటిలోకి వెళ్లకుండా, కేవలం శిక్షణ పొందిన గజఈతగాళ్ల ద్వారానే విగ్రహాలను నిమజ్జనం చేయించాలని, నిమజ్జనమైన విగ్రహాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాలోని ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి