ఉచిత పోలీస్ శిక్షణ పరీక్షకు లభించిన జనాదరణ..
హాజరైన 2,250 మంది నిరుద్యోగ యువత..
స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 500 మందికి ఉచిత ట్రైనింగ్..
పోలీస్ ఉద్యోగం సమాజసేవకు గొప్ప అవకాశం: ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ : రానున్న ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉచిత శిక్షణ తరగతులకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఉచిత శిక్షణకు సంబంధించి ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,250 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా 500 మంది అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి, నల్లగొండలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ఖాకీ డ్రెస్ వేసుకొని పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే బలమైన ఆకాంక్ష ఉన్న నిరుద్యోగ యువతకు సరైన దిశానిర్దేశం, శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగం అంటే కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి ప్రత్యక్షంగా సేవ చేసేందుకు లభించే ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపికయ్యే 500 మంది అభ్యర్థులు లభించిన ఈ అవకాశాన్ని ఎంతో బాధ్యతగా స్వీకరించాలని ఎస్పీ సూచించారు. నిరంతరం క్రమశిక్షణతో మెలుగుతూ, సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు శారీరక దృఢత్వం (ఫిజికల్ ఫిట్‌నెస్)పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
నిపుణులతో బోధన, మోడల్ టెస్టులు..
శిక్షణ కాలంలో అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షతో పాటు సబ్జెక్టు నిపుణుల ద్వారా నాణ్యమైన బోధన అందించనున్నట్లు ఎస్పీ వివరించారు. పరీక్షల విధానంపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు క్రమం తప్పకుండా మోడల్ టెస్టులు నిర్వహించడం, అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడం వంటి చర్యలు చేపడతామన్నారు. అంతేకాకుండా శారీరక దారుఢ్య పరీక్షలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల మార్గదర్శకాలను అందిస్తామని స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులంతా పట్టుదలతో శ్రమించి పోలీస్ ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి