మేడారంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య సేవలు
మేడారంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య సేవలు
Sandeep journalist
*అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ*
*50 పడకల హాస్పిటల్, మెడికల్ క్యాంపుల్లో అందుతున్న సేవలపై ఆరా*
*జాతరలో 30, ప్రధాన రహదారుల్లో 42 మెడికల్ క్యాంపుల ఏర్పాటు*
*35 అంబులెన్సులు.. 3,199 మంది సిబ్బందితో వైద్య సేవలు*
*పేషెంట్లను తరలించేందుకు మరో 40 బైక్ అంబులెన్స్‌లు*
*తక్షణమే మేడారం వెళ్లి, జాతర పూర్తయ్యే వరకూ ఉండాలని డీహెచ్‌కు మంత్రి ఆదేశం*
ఈ నెల 28 నుంచి 31 వరకూ మేడారంలో జరగనున్న సమ్మక్క–-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతర గద్దెల వద్ద ఏర్పాటు చేసిన 50 పడకల హాస్పిటల్, మినీ హాస్పిటల్స్, ప్రధాన మెడికల్ క్యాంపుల్లో స్పెషలిస్ట్ వైద్యులను డిప్యూట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. జాతరలో ఏర్పాటు చేసిన 3 హాస్పిటళ్లు, 30 మెడికల్ క్యాంపులు, జాతరకు వెళ్లి ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన మరో 42 మెడికల్ క్యాంపుల్లో అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. 3 హాస్పిటళ్లు, 72 మెడికల్ క్యాంపుల్లో కలిపి 544 మంది డాక్టర్లు సహా మొత్తం 3199 మంది సిబ్బందిని డిప్యూట్ చేశామని అధికారులు మంత్రికి వివరించారు. అవసరమైన అన్ని రకాల మెడిసిన్స్, కన్జుమబుల్స్, ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉంచుకున్నామని తెలిపారు. మేడారంలో గద్దెల వద్ద 50 పడకల హాస్పిటల్, జంపన్న వాగు వద్ద 6 బెడ్ల హాస్పిటల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మరో మినీ హాస్పిటల్ ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 11,625 మందికి వైద్య సేవలు అందించామని వెల్లడించారు. పేషెంట్లను తరలించడానికి (108) అంబులెన్స్‌లు 38, బైక్ అంబులెన్స్ 40 సిద్దంగా ఉంచుకున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతరలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌పై నిఘా పెట్టాలని, నాసిరకం ఆహార పదార్థాలను విక్రయించే షాపులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరలో ఏర్పాటు చేసిన హాస్పిటల్స్, మెడికల్ క్యాంపుల లొకేషన్లు, ఇతర వివరాలు భక్తులకు తెలిసేలా, తక్షణమే అన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జాతరలో ఏర్పాటు చేసిన 3 హాస్పిటల్స్, ముఖ్యమైన లొకేషన్లలో ఉన్న మెడికల్ క్యాంపుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను డిప్యూట్ చేయాలన్నారు. తక్షణమే మేడారం వెళ్లి, జాతర అయిపోయే వరకూ అక్కడే ఉండి పర్యవేక్షించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవిందర్ నాయక్‌ను మంత్రి ఆదేశించారు.
రిఫరల్ హాస్పిటల్స్‌గా ములుగు జీజీహెచ్, ఎంజీఎం
జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులతో పాటు, వివిధ జిల్లాల నుంచి మేడారం చేరుకునే 8 ప్రధాన రూట్లలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల్లోనూ డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా 4 వీలర్, 2 వీలర్ అంబులెన్స్‌లు 24 గంటలు సిద్ధంగా ఉండాలన్నారు. ఆపద సమయంలో నిమిషాల వ్యవధిలోనే పేషెంట్లను షిఫ్ట్ చేసి, వారికి వైద్యం అందించాలన్నారు. ఒకవేళ పేషెంట్‌కు హాస్పిటల్ కేర్ అవసరం పడితే, ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు, వరంగల్ ఎంజీఎంలకు తరలించాలని మంత్రి సూచించారు. ఈ రెండు హాస్పిటళ్లలో డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు.. సూచన
బుధవారం నుంచి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ భక్తులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి గారితో కలిసి ఇటీవల మేడారం వెళ్లి తల్లులను దర్శించుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. జాతరకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకూ సొంతగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నారు. జాతరలో నాణ్యతలేని ఆహార పదార్థాలను కొనుగోలు చేయొద్దన్నారు. అనారోగ్య సమస్య వస్తే వెంటనే సమీపంలోని హెల్త్ క్యాంపునకు వెళ్లి, వైద్య సేవలు పొందాలని మంత్రి సూచించారు. అవసరమైతే 108 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి