యాదాద్రి భువనగిరి: వినాయక నిమజ్జనాల సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ కోరారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
జిల్లాలో సుమారు 4 వేల వినాయక విగ్రహాలను ప్రతిష్టించగా.. ఇప్పటికే 750 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయిందన్నారు. బుధవారం సుమారు 2 వేల నుంచి 3 వేల విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైందని పేర్కొన్నారు. భువనగిరి డివిజన్‌లో 800, యాదాద్రి సబ్‌డివిజన్‌లో 850, చౌటుప్పల్ సబ్‌డివిజన్‌లో 1,350 విగ్రహాల నిమజ్జనం జరగనున్నట్లు తెలిపారు.
పటిష్ట బందోబస్తు
నిమజ్జనాల సందర్భంగా జిల్లాలో అదనపు ఎస్పీలు 2, డీఎస్పీలు 4, ఇన్‌స్పెక్టర్లు 15, ఎస్సైలు 30 మందితోపాటు సుమారు 500 మంది పోలీసులు, సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్, ప్రత్యేక బృందాలు, ఉమెన్ సేఫ్టీ, క్రైమ్ టీమ్స్ సిబ్బందిని విధుల్లో మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్, మున్సిపల్, గ్రామపంచాయతీ, విద్యుత్ శాఖల సిబ్బంది కూడా పోలీసులకు సహకరిస్తున్నారని చెప్పారు.
భువనగిరి చెరువు, బీబీనగర్, రాయగిరి, యాదగిరిగుట్ట నల్లచెరువు, వలిగొండ, రామన్నపేట తుమ్మలగూడెం, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి తదితర నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్, బారికేడింగ్, సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
నిబంధనలు పాటించాలి
నిమజ్జన ఊరేగింపులను నిర్ణీత మార్గాల్లోనే నిర్వహించాలని, బారికేడ్లు దాటి నీటిలోకి వెళ్లరాదని ఎస్పీ సూచించారు. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణించరాదని, ప్రమాదకరంగా నిలబడి ప్రయాణించవద్దని సూచించారు.
డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో నిబంధనలు, సమయ పరిమితులు పాటించాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ కోరారు. ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి