ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు ప్రాజెక్ట్ అధికారిక బృందాన్ని కలిసిన బీజేపీ నేతలు
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వంతెన డిజైన్ మార్చాలని వినతి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్ హెచ్ -65) విస్తరణలో భాగంగా చౌటుప్పల్ పట్టణంలో చేపడుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అదనంగా మరొక అండర్ పాస్‌ను మంజూరు చేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ఎచ్ఎఐ) కార్యాలయంలో ఆర్వో శివశంకర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ లను బీజేపీ నాయకుల బృందం కలసి వినతిపత్రం సమర్పించింది.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం చౌటుప్పల్ బస్టాండ్ వద్ద ఒకటి, చిన్నకొండూర్-నారాయణపురం చౌరస్తా వద్ద మరొక అండర్ పాస్ ఇస్తున్నారని తెలిపారు. అయితే అక్కడి నుంచి వలిగొండ రోడ్డు వరకు దాదాపు కిలోమీటరు పరిధిలో సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, ఫైర్ స్టేషన్ వంటి కీలక ప్రాంతాలు ఉన్నందున ప్రజలు, విద్యార్థులు రోడ్డు దాటేందుకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందన్నారు. ఈ క్రమంలో యుపిసి, విపిసి అండర్ పాస్‌లను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఎల్లగిరి చౌరస్తా వద్ద స్థానిక రైతులు, గొర్రెల కాపరులు సురక్షితంగా రహదారి దాటేందుకు వీలుగా 10 అడుగుల వెడల్పుతో ప్రత్యేక అండర్ పాస్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. అదేవిధంగా కొయ్యలగూడెం వద్ద ప్రస్తుతం ఉన్న అండర్ పాస్ పరిమాణం చాలా చిన్నదిగా ఉందని, ఆ ప్రాంతంలో నిత్యం పెరిగిన ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 30 అడుగుల మేర విస్తరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి