కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
యాదగిరిగుట్ట:కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహా ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంత రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ భాస్కర్ రావుతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.98,23,458/-ల వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను అందజేశారు.మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 265 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయని, ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.
ధనిక కుటుంబాలు తినే సన్న బియ్యమే పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన 16,152 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో మహిళల పేరున పెట్రోల్ బంకులు మంజూరు చేస్తున్నామని, ప్రతి పేదవాడు సొంత ఇంట్లో నివసించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.
యాదగిరిగుట్టతో పాటు యాదగిరిగుట్ట పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం రూ.100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే రూ.210 కోట్ల వ్యయంతో చేపట్టిన పైప్‌లైన్ పనులు త్వరలో పూర్తికావస్తున్నాయని, దీని ద్వారా ప్రతి ఇంటికి గోదావరి జలాలు అందుతాయని చెప్పారు. గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తయితే పరిసర ప్రాంత రైతులకు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు పుట్టింటి సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, 18 నుండి 100 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు ఈ చీరలు అందజేస్తామని తెలిపారు. త్వరలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ బ్యాంకులు మరియు శ్రీనిధి సహకారంతో 87 స్వయం సహాయక సంఘాలకు రూ.12,73,00,000/-ల బ్యాంకు లింకేజీ చెక్కులను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చైతన్య మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు,స్వయం సహాయక సంఘాల సభ్యులు,మెప్మా, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి