కాంగ్రెస్ పాలన అరాచకం.మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ పాలన అరాచకం.మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
స్థానికం బృందం
రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ పార్టీయే సంక్షోభంలో
నల్లగొండలో బిఆర్ఎస్ ప్రెస్‌మీట్‌లో చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు
స్థానికం ప్రధాన ప్రతినిధి
నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్వహించిన విలేకరుల సమావేశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష, తీరు ఏమాత్రం మారలేదని ఆయన మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి సామాన్య ప్రజలే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి వైఖరితో విసుగు చెందిపోయారని అన్నారు.పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి, రాత్రివేళ మోడీ–చంద్రబాబులతో చీకటి ఒప్పందాలు చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, స్కాంలను బిఆర్ఎస్ ప్రశ్నిస్తోందన్న అక్కసుతోనే ప్రతీకార రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు.ప్రజాక్షేత్రంలో అరాచక కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు చుక్కలు చూపిస్తున్నారని అన్నారు. బొగ్గు కుంభకోణం సహా కాంగ్రెస్ స్కాంలను ఎండగట్టినందుకే హరీష్ రావుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కక్షసాధింపులో భాగంగా రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన రాజకీయమని మండిపడ్డారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ విచారణ పేరిట హరీష్ రావును వేధిస్తోందని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను తప్పుదోవ పట్టించడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎన్నికలు వస్తే చాలు కాళేశ్వరం కేసు, ఫార్ములా–ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటూ బిఆర్ఎస్ నాయకులపై దాడులు పెంచుతారని విమర్శించారు. హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా స్పందించలేదని ఎద్దేవా చేశారు.నల్లగొండ జిల్లాకు పదేపదే వచ్చినా ఒక్క పైసా నిధులు కూడా కేటాయించని అసమర్థ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారని విమర్శించారు. అధికారం, డబ్బు, పోలీసు యంత్రాంగం ఆధారంగానే ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతోందన్నారు.సీనియర్ కాంగ్రెస్ మంత్రుల ఫోన్‌లను కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీడిస్తోందని విమర్శించారు.కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ మృతికి పోలీసులే కారణమని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమన్నారు. రాజేష్ మృతికి బాధ్యత వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నకిరేకల్‌లో స్థానిక ఎమ్మెల్యే అక్రమ ఇసుక, మట్టి రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ రెండేళ్ల పాలనతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి నెట్టడమే కాకుండా, మళ్లీ తెలంగాణలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పునరాగమనానికి మార్గం సుగమం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి