సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలి...
అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేసిన గోలి సైదులు...
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో రబీ (యాసంగి) 2025–26 సీజన్ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి అదనపు ధాన్యం కోతలు విధించి తీవ్ర నష్టం చేశారని గోలి సైదులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
కోతల పేరుతో రూ.170 కోట్ల దోపిడీ?
జిల్లాలో రబీ సీజన్‌లో దాదాపు 96,769 మంది రైతుల నుంచి రూ.1,789 కోట్ల విలువైన 7.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి రైతులపై అదనపు భారం మోపారని గోలి సైదులు పేర్కొన్నారు. తాలు, వెట్ లాస్ పేరుతో రైతుల నుంచి అదనపు ధాన్యం సేకరించారు. ఒక్కో 40 కిలోల గన్నీ బ్యాగ్‌పై సుమారు 4 కిలోల వరకు అదనంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి, హమాలీ ఖర్చులను సైతం రైతుల నుంచే అక్రమంగా వసూలు చేశారని ఈ అక్రమాల వల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి అదనంగా పోయిందని, దీని విలువ సుమారు రూ.170 కోట్ల వరకు ఉంటుందని ఆయన ప్రాథమికంగా అంచనా వేశారు.
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.17 (తేదీ: 04.10.2025)తో పాటు సంబంధిత శాఖాధిపతుల ఉత్తర్వులను (Procgs.No.CS7/80/2023, Rc.No.1599/2023-C) కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా ఉల్లంఘించారని సైదులు విమర్శించారు. DSO, DRDA-PD, DCMS, DCO, HACA, JDA వంటి అధికారుల పాత్రతో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లపై శాఖాపరమైన, చట్టపరమైన విచారణ జరపాలన్నారు. అక్రమాలు రుజువైతే వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కోరారు.
సెంటర్‌వారీగా ఆడిట్ జరిపి పరిహారం చెల్లించాలి...
కొనుగోలు కేంద్రాల వారీగా సేకరించిన ధాన్యం, గన్నీ బ్యాగులు, మిల్లులకు పంపిన వివరాలు, తాలు/వెట్ లాస్ కింద తగ్గించిన పరిమాణంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని గణించి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహార జమ చేయాలన్నారు. ఈ విషయమై జూన్ 1, జులై 6 తేదీల్లో ప్రజావాణిలో అర్జీలు ఇవ్వడంతో పాటు సంబంధిత లేఖ (CS2/94/2026) ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరపకపోతే రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి