విదేశాల్లోనూ మాకూ స్వయంసేవక్ సంఘ్ కావాలి అన్న మాట బలపడుతోంది: మోహన్ భాగవత్
విదేశాల్లోనూ మాకూ స్వయంసేవక్ సంఘ్ కావాలి అన్న మాట బలపడుతోంది: మోహన్ భాగవత్
స్థానికం బృందం
భాగ్యనగర్ వేదికగా విశ్వ సంఘ్ శిబిరం | 79 దేశాల నుంచి 1,610 మంది స్వయంసేవకుల హాజరు.

హైదరాబాద్ (భాగ్యనగర్):
ప్రపంచం అంతటా హిందూ జీవన పద్ధతిపై రోజు రోజుకీ ఆసక్తి పెరుగుతుందనీ, “మా దేశాల్లో కూడా హిందూ స్వయంసేవక్ సంఘ్ లాంటిదొకటి ఉండాలి” అన్న ఆలోచన ఇప్పుడు విదేశాల్లో బలంగా ముందుకు వస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.
ఢిల్లీకి చెందిన శ్రీ విశ్వ నికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, భాగ్యనగర్ సమీపంలోని ప్రశాంతమైన కన్హా శాంతి వనంలో నిర్వహించిన 7వ విశ్వ సంఘ్ శిబిరం (VSS) ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రపంచం నలుమూలల నుంచి భాగ్యనగర్‌కు స్వయంసేవకులు
ఈ ఐదు రోజుల ప్రపంచ స్థాయి శిబిరానికి 79 దేశాల నుంచి 1,610 మంది కార్యకర్తలు, స్వయంసేవకులు, ప్రతినిధులు హాజరయ్యారు. అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి వచ్చిన స్వయంసేవకులతో భాగ్యనగర్ వేదిక సందడిగా మారింది.
“సేవ అంటే లాభం కాదు… పేరు కాదు…”
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ...
“ధర్మం దారి తప్పినందుకే సమాజంలో అసంతులనం పెరిగింది.
సేవ అనేది లాభం కోసం కాదు… పేరు కోసం కాదు… భయం వల్ల కాదు.
ఏమీ ఆశించకుండా, నిస్వార్థంగా చేసిందే నిజమైన సేవ” అని స్పష్టం చేశారు.
ప్రతి ఐదేళ్లకోసారి ప్రజల దగ్గరికి వచ్చి ‘సేవ’ పేరుతో లాభాలు ఆశించడం సేవ కాదని, సేవ అనేది శుద్ధమైన కర్తవ్యం, అదే నిజమైన స్వయంసేవకుడి లక్షణమని భాగవత్ తెలిపారు.
ముందు మన నుంచే మొదలెట్టాలి – హెడ్డ్గేవార్ ఆలోచన

దేశంలో జరగాల్సిన మంచి పనులు ఎవరో చేస్తారని ఎదురు చూడకుండా, మన నుంచే మొదలెట్టాలి అన్న ఆలోచనతోనే డా. కేశవ బలిరామ్ హెడ్డ్గేవార్ సంఘాన్ని ప్రారంభించారని భాగవత్ గుర్తుచేశారు.
“శివ భావే జీవ సేవ” అన్న భావనతో స్వయంసేవకులు సేవనే తమ జీవన విధానంగా మార్చుకుంటారని అన్నారు.
స్వయంసేవకుల జీవన విధానం – శాకే కేంద్రం

దేశవ్యాప్తంగా నిత్యం జరిగే ఆర్‌ఎస్‌ఎస్ శాకలే స్వయంసేవకుల జీవన విధానానికి పునాది అని భాగవత్ చెప్పారు. శాక ద్వారా శారీరక, మానసిక, నైతిక క్రమశిక్షణ అలవడుతుందని వివరించారు.
విదేశాల్లోనూ కొనసాగుతున్న సంఘ్ జీవన పద్ధతి
విదేశాల్లో ఉంటున్నా హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను వదలకుండా నిత్య శాకలు, సేవా కార్యక్రమాలతో స్వయంసేవకులు ముందుకు పోతున్నారని తెలిపారు.
ఇప్పటి మూడో తరం స్వయంసేవకుల ముందు—
“మీ జీవన పద్ధతి చూసి ఇతర దేశాల వాళ్లే ‘మాకూ ఇలాంటి సంఘ్ కావాలి’ అనుకునేలా జీవించాలి” అని గట్టిగా సూచించారు.
భారత్ దారి వేరు
“భారత్ సైనిక బలం చూపించి కాదు…
ఆర్థికంగా ఇతరులను అణిచేసి కాదు…
మన జీవన విధానం ద్వారానే ప్రపంచానికి దారి చూపుతోంది”
అని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
కృష్ణ ఎల్లా వ్యాఖ్యలు


ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, మోహన్ భాగవత్‌ను “సత్యానికి చిహ్నం”గా అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి మించినది భారత్ సంస్కృతి అని, వసుధైక కుటుంబకం భావన భారత ఆలోచనల మూలమని తెలిపారు.
సంస్కృతి – ధ్యానం – జ్ఞానం

హార్ట్‌ఫుల్‌నెస్ ఉద్యమ ఆధ్యాత్మిక మార్గదర్శి పూజనీయ శ్రీ దాజీ మాట్లాడుతూ, ఒకప్పుడు అమ్మమ్మ–నానమ్మల ద్వారా వచ్చిన జ్ఞానం ఇప్పుడు తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతే మన అసలైన సంపద అని, ధ్యానం మనలోని చైతన్యాన్ని పెంచుతుందని వివరించారు.
కన్హా శాంతి వనం – విశ్వ సంఘ్ శిబిరానికి కేంద్రం

భాగ్యనగర్ సమీపంలోని కన్హా శాంతి వనం ప్రశాంత వాతావరణంలో ఈ ప్రపంచ స్థాయి శిబిరం విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి