Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 23, 2026 03:17 AM

భగత్ సింగ్ తన తండ్రికి రాసిన చివరి లేఖ

భగత్ సింగ్ తన తండ్రికి రాసిన చివరి లేఖ

భగత్ సింగ్ తన తండ్రికి రాసిన చివరి లేఖ
March 23, 2026 12:49 AM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మార్చి 23, 1931న భగత్‌సింగ్‌ సగర్వంగా ఉరికంబమెక్కాడు. తనను ఉరి తీసే ఆఖరి క్షణాల్లో కన్నతండ్రికి షహీద్‌ భగత్‌సింగ్‌ రాసిన చిట్టచివరి లేఖ ఇది. 89ఏండ్ల క్రితం రాసిన ఈ ఉత్తరాన్ని సమకాలీన పరిస్థితులకు పోల్చి విషయాలు విశ్లేషించుకోవాల్సి ఉంది. నాటి అమరవీరుల త్యాగాల ముందు నేటి పాలకులు ఎక్కడ ఉన్నారో బేరీజు వేసుకోవాల్సి ఉంది. అంతేకాదు, సామాన్య పౌరులుగా మనం ఎటువైపు ఉన్నాం అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంది.

''పూజ్యులైన నాన్నగారికి,

నన్ను ఉరికంబం నుంచి తప్పించేందుకు కన్నతండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా సంతోషపడతానేమో కానీ, ఈ దేశ పౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను. మీ కొడుకునైనందుకు మీ ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవిస్తాను. కానీ, మీకన్నా ముందు ఈ మాతృభూమి రుణం తీర్చుకునే హక్కు నాకు లేదంటారా? నేను బ్రిటీషర్లపై చేసిన దాడిని నేరంగా భావించడం లేదు. అందుకే నేనెప్పుడూ మీ ముందు నిర్దోషినని నిరూపించుకునేందుకు కోర్టులో వాదించేందుకు అంగీకరించలేదు.

నాన్నగారూ! నా జీవితం మనదేశం కన్నా విలువైనదేమీ కాదు. అసలు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికే సమర్పణ చేయాలని నమ్ముతాను కూడా. అందుకు ఎన్ని ప్రతిఘటనలైనా ఎదురుకోవాలి. అలాంటి ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా, కాలం చెల్లిన పాత విశ్వాసాల్ని సవాలు చేయాలి. నాకు తెలుసు. నా మెడకు ఉరితాడు బిగుసుకోవడమే నాకు ఆఖరిక్షణం కాగలదని.. అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కాని, దయనీయం కాదు. ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశ స్వాతంత్య్రం కోసం అర్పించాననే సంతృప్తితో, చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. మానవాళికి సేవ చేయడానికి, పీడితులకు విముక్తి కలిగించడానికి యువతరం ముందుకు వచ్చినప్పుడే నవయుగానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది.

నాన్నగారూ! నా మరణానంతరం ముందు తరాలకు త్యాగమనే సుగుణం - తీగలా సాగి, పాకిపోయేలా చూడండి. ఎలాంటి పరిక్షా సమయంలోనైనా, మహత్తరమైన మానసిక దృఢత్వాన్ని సడలనీయకుండా చూసుకొమ్మని ప్రోత్సహించండి. ఇక సెలవు.. ఇట్లు.. మీ ప్రియ పుత్రుడు భగత్‌సింగ్‌.''

భగత్‌సింగ్‌ అమరుడయ్యాక పదహారేండ్లకు దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక డైభ్భైమూడేండ్ల తర్వాత ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్థుతం దేశాన్ని పాలిస్తున్నవారు దేశభక్తికి నిర్వచనం మార్చేశారు. వీరు గాడ్సే భక్తులు గనుక, వీరికి భగత్‌సింగ్‌, గాంధీ, నెహ్రూలు నచ్చరు. మత విశ్వాసాలు రెచ్చగొట్టి, దేశ ప్రజల్ని విడదీయడం వీరి ధ్యేయం! హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. తామే దాడులు చేయిస్తుంటారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తుంటారు. పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తారు. బాధితుల్ని నిందితులుగా ప్రకటిస్తారు. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తారు. బ్యాంకులు దివాలా తీయించి, దేశం వెలిగి పోతుందంటారు. దోపిడీ గాళ్లను గుట్టుచప్పుడు కాకుండా పారిపో నిస్తారు. స్వచ్ఛభారత్‌ అయిపోయిందం టారు. కరోనా వైరస్‌ నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటారు కానీ, తమ కాషాయ వైరస్‌ - దేశమంతా వ్యాపించాలని పాకులాడుతారు. దేశ ఆర్థిక వ్యవస్థని వెంటిలేటర్‌పై ఉంచి, మేకిన్‌ ఇండియా అంటారు. అఖండ హిందూ రాజ్యంగా ఈ దేశం మారిపోవాలను కుంటారు. ఇలాంటి వారికి భగత్‌సింగ్‌ లాంటి అమరవీరుల త్యాగాలు అసలు అర్థం కావేమో? అందువల్ల వివేకవంతులైన సామాన్య ప్రజల మీద ఇప్పుడు బాధ్యత ఉంది. అందుకే దేశం యావత్తూ - ఒక నిరసన గళమై పౌరసత్వ చట్టాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉంది.

ముందు ముందు ఇలాంటి పాలకులు వస్తారనే కాబోలు స్వాతంత్య్రానికి ముందు విన్సెంట్‌ చర్చిల్‌ ఇలా ప్రకటించాడు.. ''అధికారం మూర్ఖుల చేతిలోకి వెళుతుంది. భారతీయ నాయకులంతా తక్కువ స్థాయి మనుషులు. తీపి నాలుకలు, కపట హృదయాలు కలవారు. అధికారం కోసం వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చస్తారు. గాలి, నీరు కూడా అమ్ముడైపోయే రోజు వస్తుందిక్కడ!'' భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలా వద్దా? అన్న చర్చలో సర్‌ విన్సంట్‌ చర్చిల్‌ చెప్పిన అంశాలివి. ఆయన మాటలు నిజం చేయడానికి భారతీయ రాజకీయ నాయకులు తమ శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలితరం దేశ నాయకులకు చర్చిల్‌ చెప్పింది వర్తించకపోవచ్చు. కానీ, తర్వాతి తరాల్లో ఆయన చెప్పిందే నిజమవుతూ వస్తోంది. అందుకే చూడండి.. గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి దాకా రాజకీయ నాయకులవి తీపి నాలుకలే. కపట హృదయాలే! కాకపోతే అక్కడక్కడా కొన్ని మినహాయింపులుంటాయి. మళ్ళీ, అది వేరే విషయం...

భగత్‌సింగ్‌ సామాజిక అవగాహన, విప్లవ దృక్పథం నేటి యువతరానికి చాలా అవసరం. భగవంతుడనేవాడు ఉంటే ఈ ప్రశ్నలకి సమాధానమివ్వాలి అని ఆయన కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నలూ, ఆయన వాదనా పటిమా ఇప్పటికీ మనల్ని అబ్బురపరుస్తున్నాయి. ఆస్థికులను కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఆయన ఆలోచనల సారాంశం ఇలా ఉంది.. ''ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సర్వశక్తి మంతుడు, సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఒకడు ఉన్నాడని నమ్మే వారు ఆయన ఈ సృష్టికి ఎందుకు పూనుకున్నాడో చెప్పాలి. సృష్టిస్తే.. ప్రపంచంలో అధిక శాతం ప్రజలు పేదరికంలో, బాధలతో, అనేకానేక అత్యాచారాలకు గురవుతూ జీవించేట్టు ఎందుకు సృష్టించాడు? అందరినీ సుఖసంతోషాలతో ఉంచొచ్చుకదా? కొందరికి ఆనందాల్ని, మరికొందరికి దుఃఖాల్నీ ఎందుకు పంచుతున్నాడు? కన్నతండ్రి తన బిడ్డల పట్ల ఇలా వివక్ష చూపడు కదా? అంటే మామూలు మనిషికి ఉండే మనసు కూడా ఆయనకు లేదా? పోనీ ఆయన కొన్ని సూత్రాలు.. నిబంధనలకు అనుగుణంగా పరిపాలిస్తుంటే.. ఆయన సర్వ స్వతంత్రుడు కానట్టే కదా? దేనికో ఎవరికో లొంగిపనిచేస్తున్నట్టే కదా?'' అని భగత్‌సింగ్‌ ప్రశ్నించాడు.

నీరో చక్రవర్తి రోమ్‌ నగరాన్ని తగులబెట్టించాడు. ప్రజలను హతమార్చాడు. తన చిరు సంతోషాల కోసం అనేక దుర్ఘటనల్ని జరిపించాడు. అలాంటి నీరో చక్రవర్తి స్థానం చరిత్రలో ఎలా మిగిలింది? పరమ కర్కోటకుడిగా, హృదయం లేని బండరాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అతన్ని ఎవరూ పొగడరు. ఎవరూ ప్రార్థించరు. అలాగే చెంఘిజ్‌ ఖాన్‌ విషయం.. ఇతను కూడా తన సంతోషం కోసమే వేల మందిని హతమార్చాడు. ప్రజల్ని దుఃఖంలోకి నెట్టాడు. ఇతన్ని కూడా ఎవరూ పొగడరు. ఎవరూ ప్రార్థించరు. వీరు, వారి బతికి ఉన్న కాలంలోనే దుర్మార్గాలు చేశారు. దుష్టులుగా నిలిచిపోయారు. అలాంటప్పుడు క్షణక్షణం ప్రపంచవ్యాప్తంగా జనాన్ని కన్నీళ్ళకు, కడగళ్ళకు, కష్టాలకు, నష్టాలకు గురిచేస్తున్న ఆ పరమాత్మను పరమదుర్మార్గుడిగా కాక, రక్షకుడిగా ఎందుకు పొగడుతున్నారు? ఎందుకు ప్రార్థిస్తున్నారు? నిరీశ్వరవాదుల ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. వారికి దేవుడితో సంబంధమే లేదు. వారి జీవితంలోని కష్టనష్టాలకు దేవుడిమీద భారం వేయరు. దేవుణ్ణి పూజించరు. నిందించరు. వారి దృష్టిలో అతను లేనేలేడు. విషయం అక్కడ స్పష్టంగా ఉంది. ఆస్థికుల విషయంలోనే విషయం అస్పష్టంగా ఉంది. దేవుడి ప్రమేయం లేకుండా జరిగే మంచిని కూడా ఆయన ఖాతాలోనే ఎందుకు వేస్తున్నారన్నది భగత్‌సింగ్‌ ప్రశ్న.

నీరో చక్రవర్తి అయినా, చెంఘిజ్‌ఖాన్‌ అయినా ఎప్పుడో ఓసారి దౌర్జన్యాలు చేశారు. కానీ, ఈ దేవుడేమిటీ? ప్రపంచ ప్రజలందర్ని అనుక్షణం కష్టాల పాలుజేస్తున్నాడు? ఆయనను ఎందుకు కొలవాలి? ఎందుకు పూజించాలి? నరక ప్రాయంగా ఉన్న ఈ ప్రపంచాన్ని సృష్టించినందుకా? ఆయన సర్వశక్తి సమన్వితుడు అని అంటారు కదా? ఏదైనా చేయడానికీ, చేయకుండా ఉండటానికీ ఆయన సమర్థడు కదా? అలాంటప్పుడు బాధలు పడే మనుషుల్ని ఎందుకు సృష్టించాడు? వారి కోసం ఒక దుఃఖ ప్రపంచాన్ని ఎందుకు సృజించాడూ? ఇదే నా సూటి ప్రశ్న! ఇంత చేసిన వాణ్ణి మనం అనుక్షణం స్మరిస్తూ, అన్ని విషయాల్లో సమర్థిస్తూ ఉండాలా? ఇలాంటి ప్రశ్నలతో నిరీశ్వరవాదులకు సంబంధం లేదు. దేవుడెలాగూ సజీవంగా మనకు కనబడడు గనక, ఆయన నుంచి జవాబు రాదు. ఇక దేవుడి పక్షాన వకాల్తా పుచ్చుకున్న వారే డొంకతిరుగుడు లేకుండా సూటిగా సమాధానం చెప్పాలి. ఒకప్పుడు పులుల ముందుకు మనుషుల్ని నెట్టి వినోదం చూసేవారు. పులులకు ఆహారమై పోకుండా ఎవడైనా పొరపాటున బతికి బయటపడితే.. వాడికి పంచభక్ష పరమాన్నాలు పెడతాం.. అనేవారు. అన్ని సంపదలు, సర్వసౌఖ్యాలు సమకూరుస్తామనేవారు. (ఇలాంటి ఇతివృత్తాలతో హాలివుడ్‌ సినిమాలు మనం చూశాం) సరిగ్గా ఇదీ అలాగే ఉంది. ఈ ప్రపంచంలోని దుఃఖాల్ని 'వారి' నియమావళి ప్రకారం దాటుకుని వెళితే.. అక్కడెక్కడో స్వర్గప్రాప్తి లభిస్తుందంటారు. దేవుడే ఓ అబద్ధం అయితే, ఇక స్వర్గమనేది అంతకన్నా పెద్ద అబద్ధం.. అని జనం గ్రహించుకుంటున్నారు కదా? దానికేమంటారు?

కష్టపడుతూ కూడా కడుపు నింపుకోలేనివాళ్ళు, బట్టల్లేక, ఇల్లులేక ప్రజలు ఎందుకు అలమటిస్తున్నారు? చెరసాలల్లో మగ్గేవాళ్ళు, అణగదొక్కబడి చిత్రహింసలకు గురవుతున్నవారు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. వారంతా దోపిడీ చేయబడుతున్నారు. వారంతా నిరంతరం తమ రక్తాన్ని స్వేదంగా మారుస్తున్నవారు. వారిపట్ల ఆ దేవదేవుడు ఎందుకంత నిర్లిప్తంగా ఉన్నాడు? కష్టజీవుల రక్తం పీల్చే జలగలు, పెట్టుబడి దారులు, మోసకారులు ఎందుకు సంపన్నులవుతున్నారు? అంటే దేవుడు సంపన్నులకు మాత్రమే స్వంతమా? అలాంటప్పుడు సామాన్యులంతా దేవుణ్ణి ఎందుకు తృణీకరించగూడదూ? పెట్టుబడిదారులపై తిరగబడ్డట్టుగానే, వీరంతా దేవుడిపై కూడా ఎందుకు తిరగబడగూడదూ? నాటి నీరోచక్రవర్తికి నేటి పాలకులకు, పాలకులకూ పెట్టుబడిదార్లకూ తేడాయే లేనప్పుడు.. ''బలహీనుల భ్రమల్లో బతికే దేవుడు కూడా, ఇక ఎక్కువ కాలం బతకడు కదా?'' అన్నది భగత్‌సింగ్‌ భావన!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News