Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 04:19 PM

చైనా ముందు మోదీ మౌనం: కారవాన్ కథనం దేశ రాజకీయాలు దులుపుతోంది!

చైనా ముందు మోదీ మౌనం: కారవాన్ కథనం దేశ రాజకీయాలు దులుపుతోంది!

చైనా ముందు మోదీ మౌనం: కారవాన్ కథనం దేశ రాజకీయాలు దులుపుతోంది!
February 07, 2026 05:07 AM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

చైనా ముందు మోదీ మౌనం: కారవాన్ కథనం దేశ రాజకీయాలు దులుపుతోంది!

2020 గల్వాన్‌ ఘర్షణ సమయంలో యుద్ధ ట్యాంకులతో సరిహద్దులవైపు చైనా సైన్యం ఎలా ఎదుర్కోవాలో ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఆర్మీచీఫ్‌ నరవణే పరిస్థితి చేజారుతున్నా కేంద్రం తాత్సారం చివరకు 'మీకు నచ్చింది చేయండి' అంటూ చేతులు దులుపుకున్న ప్రధాని నరేంద్రమోదీ యుద్ధం చేయాలా? వద్దా? అని నిర్ణయించాల్సింది ప్రభుత్వం.. సైన్యం కాదు అగ్నివీర్ల వేతనాల్లోనూ కేంద్రానిది పక్షపాతమే 'ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ' పుస్తకంలో ఆర్మీ మాజీ చీఫ్‌ మనోజ్‌ నరవణే సంచలన విషయాలు పుస్తకం ముద్రణకు కేంద్ర ప్రభుత్వం నో.. 'కారవాన్‌’ కథనం ద్వారా వెలుగులోకి. చైనాతో యుద్ధం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ప్రభుత్వం చేతులెత్తేసిందా? డ్రాగన్‌ మూకలు విరుచుకుపడుతూ ముందుకు ఉరికివస్తుంటే, సైనికుల భద్రతను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందా? అంతర్జాతీయ మ్యాగజైన్‌ 'కారవాన్‌’లో ఆదివారం ప్రచురితమైన ఓ కథనం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నది. అసలేమైంది?? ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద నరవణే 'ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ' అనే ఓ పుస్తకాన్ని రాశారు. భారత్‌-చైనా సంఘర్షణకు సంబంధించిన విషయాలను నరవణే ఆ పుస్తకంలో ఉటంకించారు. సైనిక చర్యలపై వివిధ అంశాలు ఉన్నాయన్న కారణంతో పుస్తకాన్ని సమీక్షించాలని రక్షణ శాఖ ఆ బుక్‌ విడుదలను పెండింగ్‌లో ఉంచింది. అలా ఏడాదిన్నరగా ఆ పుస్తక ముద్రణ అలాగే నిలిచిపోయింది. అయితే, ఆ పుస్తకంలో నరవణే రాసిన కొన్ని కీలక విషయాలను 'కారవాన్‌’ మ్యాగజైన్‌ తాజాగా బయటపెట్టింది. చైనా సంక్షోభ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మోదీ సర్కారు వెనుకంజ వేసినట్టు ఆ కథనంలో ఆరోపించింది. ఈ మేరకు నరవణే పుస్తకంలోని కొన్ని భాగాలను ఉటంకించింది.

కథనంలో ఏమున్నది?

2020లో తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా సైన్యం మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో జనరల్‌ నరవణే ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. జూన్‌ 15-16 తేదీల్లో జరిగిన ఉద్రిక్తతల్లో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులు కాగా, చైనా వైపున కూడా పెద్దయెత్తున సైనికులు మరణించారు. దీంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. కారవాన్‌ మ్యాగజైన్‌ కథనం ప్రకారం.. ఆగస్టు 31 రాత్రి 8.15 నిమిషాల సమయంలో నరవణేకు ఓ సమాచారం అందింది. చైనాకు చెందిన నాలుగు యుద్ధ ట్యాంకులు, కొంతమంది సైన్యం తూర్పు లద్దాఖ్‌లోని రేచిన్‌ లా ప్రాంతంలోకి చొరబడబోతున్నట్టు తెలిసింది. కైలాస్‌ రేంజ్‌కు డ్రాగన్‌ సైన్యం కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)లో గస్తీ కాయాలంటే ఇదే కీలక ప్రాంతం. దీన్ని చైనా సేనలు ఆధీనంలోకి తీసుకొంటే, పరిస్థితి దిగజారిపోతుంది. కైలాస్‌ రేంజ్‌కు రావొద్దంటూ డ్రాగన్‌ మూకలను బెదిరించడానికి అప్పటికే, భారత సైనికులు గాలిలో కొన్ని కాల్పులు జరిపారు. అయినప్పటికీ, డ్రాగన్‌ సేనలు ముందుకే కదులుతున్నాయి.

రాజ్‌నాథ్‌కు ఫోన్‌ కాల్‌

దీంతో ఆందోళనకు గురైన నవరణే.. చైనా కుట్రలను ఎలా తిప్పిగొట్టాలన్న విషయంలో తగిన ఆదేశాల కోసం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. 'ఇప్పుడు మేం ఏం చేయాలి? ఆదేశాలు ఇవ్వండి' అని నరవణే ఆయన్ని కోరారు. రాజ్‌నాథ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, అప్పటి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కూడా జరిగిన విషయాన్ని నరవణే తెలియజేశారు. 'ఏం చేయాలంటూ?' అందరినీ అడిగారు. నరవణే అందరినీ ఇలా అడగడానికి ఒక కారణం ఉంది. చైనా సంక్షోభ సమయం కొనసాగుతున్నప్పుడు.. 'పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుండా ఎలాంటి కాల్పులు జరుపకూడదు' అనే నిబంధనలను కేంద్రం ఆర్మీకి ముందే జారీ చేసింది. దీంతో తమ తదుపరి కార్యాచరణ ఏమిటని నరవణే అందరినీ అడగడం ప్రారంభించారు.

సమయం లేదు.. ఆదేశాలు ఎక్కడ? సమయం రాత్రి 9.10 గంటలు కావొస్తున్నది. గ్రౌండ్‌లోని సైన్యాధికారి నరవణేకు మళ్లీ ఫోన్‌ చేశారు. 'చైనా యుద్ధ ట్యాంకులు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్నాయి' అంటూ పరిస్థితి చేజారిపోతున్న విధానాన్ని వివరించారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకొన్న నరవణే.. 9.25 గంటల ప్రాంతంలో రాజ్‌నాథ్‌కు మళ్లీ ఫోన్‌ చేసి పరిస్థితిని తెలియజేశారు. ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో చైనా సైనికులు వెనుదిరుగుతున్నట్టు డ్రాగన్‌ ఆర్మీ కమాండర్‌ నమ్మించాడు. దీంతో భారత సైన్యం కొంత ఉపశమనానికి లోనైంది. అయితే, ఆ కమాండర్‌ చెప్పింది అబద్ధం. డ్రాగన్‌ యుద్ధ ట్యాంకులు ముందుకే ఉరికి వస్తున్నాయి. దీంతో గ్రౌండ్‌లో ఉన్న జవాన్లు అప్రమత్తమయ్యారు. నరవణే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. యుద్ధ ట్యాంకులు 500 మీటర్ల దూరం వరకూ వచ్చాయి. దీంతో పరిస్థితి చేజారిపోయేలా ఉందని, గ్రౌండ్‌లోని సైన్యాధికారి నరవణేకు తిరిగి ఫోన్‌ చేశారు. 'చైనా సైన్యాన్ని నిలువరించాలంటే ఎదురు కాల్పులు జరుపడమే దారి. మేం సిద్ధంగా ఉన్నాం. మీ ఆదేశాలే ఆలస్యం' అంటూ అటు నుంచి ఆ అధికారి చెప్పాడు. అయితే, నరవణే పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారింది. గ్రౌండ్‌లో ఉన్న మన సైనికులు చైనా మూకలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, పై నుంచి ఆదేశాలు రావట్లేదు. 'నా పరిస్థితి ఇంత క్లిష్టంగా మారింది ఏంటి?' అని నరవణే ఆందోళన చెందారు. దీంతో రాజ్‌నాథ్‌కు మళ్లీ ఫోన్‌ చేశారు. అయినప్పటికీ, పై నుంచి ఆదేశాలు రాలేదు. పరిస్థితి చేజారిపోయేలా తయారైంది. నరవణేలో ఆందోళన మరింత పెరుగసాగింది.

చివరకు ఫోన్‌ చేసి ఏమన్నారంటే??

తీరా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాజ్‌నాథ్‌.. నరవణేకు ఎట్టకేలకు ఫోన్‌ చేశారు. 'ప్రధాని మోదీతో మాట్లాడా. పరిస్థితి వివరించా. జో ఉచిత్‌ సమ్‌జో వో కరో (మీకు ఏది సరైనది అనిపిస్తుందో.. అది చేయండి) అని ఆయన చెప్పారు' అంటూ ఒక్క ముక్కలో రాజ్‌నాథ్‌ తేల్చిపారేశారు. పైగా ఇది పూర్తిగా సైనిక చర్య అంటూ ముగించారు. దౌత్య సంబంధాలపైనే కాకుండా రాజకీయ, సామాజిక అంశాలను ప్రభావితం చేసే ఇలాంటి సున్నితమైన అంశాలపై నిజానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఏం నిర్ణయించాలో మోదీ ప్రభుత్వం నాకే వదిలేయడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైనట్టు నరవణే వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మోదీ తనకు ఫోన్‌ చేస్తారని అనుకొన్నానని, అయితే ఫోన్‌ చేయడానికి మోదీ అయిష్టతతో ఉన్నట్టు తెలిసిందని వెల్లడించారు. మొత్తానికి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ సమస్యను నా నెత్తిన పెట్టారని నరవణే అసహనం వ్యక్తం చేసినట్టు కారవాన్‌ తెలిపింది.

చైనా-పాక్‌ కలిస్తే?

ప్రధాని మోదీ నుంచి అలాంటి సమాధానం రావడంతో నరవణే మెదడులో వందలాది ఆలోచనలు వచ్చాయి. దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్నది. ఆర్థికం ఛిన్నాభిన్నమైంది. విదేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఇలాంటి సమయంలో దీర్ఘకాల ఘర్షణలకు దిగితే, మనకు ఆయుధాలను ఎవరు సరఫరా చేస్తారు? ఏ దేశం మనకు అండగా ఉంటుంది? ఇదే అదునుగా చైనా-పాక్‌ చేతులు కలిపితే, మన ప్రజల పరిస్థితి ఏంటి? ఇదే నరవణే మనసులో మెదులుతున్న ఆలోచనలు. 'యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, దాన్ని ఇప్పుడు మొదలుపెట్టాలా?' అని నరవణే సంశయించారని కారవాన్‌ వెల్లడించింది. వాళ్లు అలా చేయలేదే..

ఒక దేశం యుద్ధానికి వెళ్లాలా? లేదా? అనేది ఆర్మీ తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. 1999 కార్గిల్‌ యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి భద్రతపై ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ భేటీలో ప్రతి అంశాన్ని వివరించి, సలహాలు-సూచనలు తీసుకొని నిర్ణయాలు వెల్లడించేవారు. అనంతరం ప్రధానే వీటిపై అంతిమ నిర్ణయాన్ని తీసుకొనేవారు. 1971లో బంగ్లాదేశ్‌ కోసం జరిగిన యుద్ధంలోనూ మాజీ ప్రధాని ఇందిర ఇదే విధంగా చేశారు. అయితే. ఇప్పుడు అలా లేదు. నిజానికి, దేశ ఆర్థిక స్థితిగతులు, కరోనా సంక్షోభం, అమెరికా దౌత్యం, పాక్‌-చైనా కలిస్తే పరిస్థితి ఏమిటి? తదితర విషయాలను విశ్లేషించి ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చి మాకు (సైన్యానికి) ఆదేశాలు ఇవ్వాలి. ఆ ఆదేశాలు కూడా కచ్చితంగా, త్వరితగతిన, సూటిగా ఉండాలి. అయితే, అలా జరుగలేదని నరవణే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కారవాన్‌ తెలిపింది.

అగ్నివీర్‌లపై ఇలా..

అగ్నిపథ్‌ గురించి కూడా ఆ పుస్తకంలో నరవణే ప్రస్తావన తెచ్చినట్టు కారవాన్‌ వెల్లడించింది. '2022 జూన్‌లో తీసుకొచ్చిన అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌లో తొలుత శిక్షణ పొందిన 75% మందిని తీసుకోవాలని అనుకొన్నాం. చివరకు దానిని 25 శాతానికి కుదించారు. ఇక, అగ్నివీరులకు వేతనాన్ని తొలుత నెలకు రూ. 20 వేలుగా నిర్ణయించారు. దేశం కోసం ప్రాణాలను కూడా పణంగా పెడుతున్న ఈ సైనికులకు దినసరి కూలీలకు ఇచ్చే జీతాన్ని ఇవ్వడమా? అనుకొన్నా. దాన్ని ఖండించా. దీంతో ఆ వేతనాన్ని రూ. 30 వేలకు పెంచారం'టూ నరవణే పుస్తకంలో ప్రస్తావించారు.

పాక్‌తో అలా.. చైనాతో ఇలా..

2014 సమయంలో మోదీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్‌.. ఇప్పటి వాస్తవ పరిస్థితులతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు కారవాన్‌ అభిప్రాయపడింది. ఆ కథనం ప్రకారం.. పుల్వామా, బాలాకోట్‌ ఉదంతాలను ఉటంకిస్తూ.. మోదీ ఎంతో ధైర్యమైన నిర్ణయాలను తీసుకొంటారని మీడియా ఊదరగొట్టింది. దీనిపై పలు సినిమాలు, వెబ్‌-సిరీస్‌లు కూడా చిత్రీకరించారు. అంతేకాదు, బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్స్‌ను మోదీనే దగ్గరుండి పర్యవేక్షించినట్టు చెప్పారు. పాక్‌ విషయంలో మోదీ ఇలా చేశారనుకొందాం కాసేపు. మరి, చైనా విషయంలో ఏమైంది? అంటూ కారవాన్‌ ప్రశ్నించింది. అంతేకాదు తూర్పు లద్దాఖ్‌లోకి చైనా సైన్యం చొచ్చుకు వచ్చిందని, అయితే ఆ విషయాలను కేంద్రం బయటకు చెప్పకుండా వాస్తవాలను వక్రీకరించిందని కూడా ఆరోపించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News