Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 06:21 AM

దళితులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు?

దళితులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు?

దళితులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు?
February 12, 2026 05:01 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

రాష్ట్రంలో దళితులుగా పిలువబడే 59కులాలూ, సుమారు 50లక్షల జనాభా, 18లక్షల కుటుంబాలూ ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 18శాతంగా ఉన్నారు. అధికంగా పేదలు, వ్యవసాయ కార్మికులుగా, వలస కార్మికులుగా జీవిస్తున్నారు. రాష్ట్రంలో దళిత వాడలు సుమారు 20వేల వరకు ఉన్నాయి. ఇవి ఊరు చివర అభివృద్థికి ఆమడ దూరంలో ఉంటాయి. ఇది నేటి దళితుల స్థితి. దళితులను సమాజంలో ఉన్నత స్థాయికి తేవాలని రాజ్యాంగం లో కీలకమైన ఆర్టికల్స్‌ను రాసుకున్నాం. కానీ వాటి అమలు సక్రమంగా జరగకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు దళితుల బతుకులు సాగుతున్నాయి.

ఆర్టికల్‌ 16(4) రిజర్వేషన్లు, ఉద్యోగ కల్పన, ఆర్టికల్‌ 17 అంటరానితనం నిర్మూలన, ఆర్టికల్‌ 46 ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సౌకర్యాల కల్పన, సామాజిక న్యాయం దోపిడీకి గురికాకుండా రక్షణ, ఆర్టికల్‌ 341,342 దళితుల అభివృద్థిని గవర్నర్ల సహాయంతో చేయడం, ఆర్టికల్‌ 335 సామర్థ్యం నిర్వహాణ, నియమకాలు, ఆర్టికల్‌ 338 దళితుల అభివృద్థికి ప్రత్యేక అధికారాలు, నియామకం, జాతీయ కమిషన్‌, సహాకార కార్పొరేషన్‌ ఏర్పాటు... రాజ్యాంగంలో ఇన్ని హాక్కులు ఉన్నప్పటికి అమలులో తీవ్రమైన వైఫల్యం జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది. నేటి బీజేపీ పాలకులు రాజ్యాంగాన్ని సమీక్షించాలి, మార్చాలి, ఆర్టికల్‌ 16(4)ను రద్దు చేయాలి, రాజ్యాంగ స్థానంలో మనువాద ఏజెండాను అమలు చేయాలని తీవ్రప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, 370 ఆర్టికల్‌ రద్దు, దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి.

క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2019 నివేదిక ప్రకారం దేశంలో దళితులపై నేరాల్లో మొత్తం 7.3శాతం పెరుగుదల ఉంది. 45935 నేరాలు, దారుణకేసులు నమోదు చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో 11,829 కేసులు. ఇది దేశ మొత్తం కేసుల్లో 25.8శాతం, రాజస్థాన్‌ 6794 కేసులు 14.8శాతం, బీహార్‌ 14.2శాతం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై లైంగిక వేదింపులు అత్యాచారాలు హత్యలు కిడ్నాప్‌లు ఎక్కువగా నమోదయ్యాయి.. దళితులు, అంబేద్కర్‌పై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎంత ప్రేమ ఉందో ఈ నేరాలను బట్టి అర్థమవుతుంది.

రాష్ట్రంలో 2014లో 1104 సంఘటనలు జరిగితే 2019లో నవంబర్‌ 18నాటికి 1904 సంఘటనలు జరిగాయి. కిరాతకమైన హత్యలు జరిగాయి. కులదురంకార హత్యలు 49జరిగాయి. అత్యాచారాలు దౌర్జన్యాలు లైంగిక వేదింపులకు తోడు వీడీసీల పేరుతో ఉత్తర తెలంగాణ 4జిల్లాల పరిధిలో 200గ్రామాల్లో దాడులు జరిగాయి.

అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం, అనేక గ్రామాల్లో గ్రామ బహిష్కరణలు జరిగాయి. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో దళితులకు ఏమాత్రం రక్షణలేదు. రాష్ట్ర మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దళితులకు కల్పించబడ్డ హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989ను ప్రభుత్వాలు అమలు చేయలేదు. ప్రభుత్వాలు చట్టాన్ని నీరుగార్చడమే కాకుండా దళితులపై పెరుగుతున్న దాడులకు దోహదం చేస్తూ నేరస్థులకు అండగా నిలబడు తున్నవి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు బహిరంగ ప్రజా వేదికల నుంచి రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించా లని డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పునర్‌పరిశీ లించాలని కోరుతున్నారు. గ్రామాల్లో హౌదా, గౌరవం భూ పరిమాణాన్ని బట్టి నిర్ణయించ బడుతుంది. ఇందులో దళితుల పరిస్థితి చూస్తే తెలంగాణలో 18లక్షల కుటుంబాలు ఉండగా 7.12లక్షల కుటుంబాలకు 13.12లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది.

రాష్ట్రంలో మొత్తం సాగు భూమి 1.65కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో దళితుల భూములు ఎన్ని? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినట్టు 3లక్షల భూమి లేని కుటుంబాలకుగాను, 3ఎకరాల భూమి కొనుగోలు పథకం కింద గత 7ఏండ్లలో 6,662 కుటుంబాలకు 16544.13 ఎకరాలను మాత్రమే కొనుగోలు చేసి పంపిణీ చేసారు. ఇందులో 511మందికి 1122.02 ఎకరాలకు నేటికి రిజిస్ట్రేషన్‌ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రతి ఏటా 10వేల కోట్లు కేటాయించి ఐదేండ్లలో 50వేల కోట్లు ఖర్చు చేసి భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి భూమి ఇస్తామని ప్రకటించి మాట మార్చిన కేసీఆర్‌ దళిత వ్యతిరేకిగా నిలబడ్డారు. పైగా గత ప్రభుత్వాలు దళితులకు అసైన్డ్‌ చేసిన భూములను అభివృద్ధి పేరుతో ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్నది. ఈ భూముల్లో గ్రామ పార్కులు, డంపింగ్‌ యార్డులు, రైతు వేదికలు, స్మశాన బిల్డింగ్స్‌, ఇండిస్టీ పార్కులు నిర్మిస్తున్నారు. ఇది ధనవంతులకు, భూస్వాము లకు రియలేస్టేట్‌, పరిశ్రమ అధిపతులకు భూములను ధారదత్తం చేసే భూస్వామ్య, దొరల ప్రభుత్వమని తేలిపోయింది.

2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు ఏడేండ్లలో దళితుల ప్రత్యేక అభివృద్ధికి 85913 కోట్లు కేటాయించి 57100 కోట్లు మంజూరు చేసి 47685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ నినాదాలు బాగా వినబడుతున్నప్పటికీ 50శాతంలోపే ఖర్చు చేసి దళితుల అభివృద్ధిని సాదిస్తామంటే ఏలా సాధ్యం. స్వయం ఉపాధి పథకాలకు గత ఐదేండ్లుగా 5లక్షలకుపైగా ధరఖాస్తులు పెట్టుకున్నారు. లక్ష 20వేల మందికి మంజూరు చేసి లక్ష మందికి సబ్సిడీ విడుదల చేశారు. 13వందల కోట్లు కేటాయించి 1160 కోట్లు ఖర్చు చేశారు. 2019 నుంచి 21 వరకు రెండేండ్లకు యాక్షన్‌ ఫ్లాన్‌ విడుదల చేయలేదు. నిరుద్యోగులు ప్రతి సంవత్సరం సుమారు 2లక్షల వరకు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది. సరిపడని బడ్జెట్‌ కేటాయించారు. లోన్‌ కోసం విషమ షరతులు విధిస్తున్నారు. తిరిగి తిరిగి విసిగి వేసారి లోన్స్‌కు దూరంగా ఉండే దుస్థితి వస్తున్నది. ఏలాంటి షరతులు లేకుండా ప్రతి ఏడాది 1500 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తే దళిత నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.

అక్షరాస్యతలో దళితులు 50శాతం కూడా లేరు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. వైద్యం పూర్తిగా కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రజారోగ్యోం దెబ్బతినడం వల్ల ఆర్థికంగాలేని దళితుల్లో చిన్న చిన్న జబ్బులకే మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలి. జీఓ 342 ప్రకారంగా 101 యూనిట్ల విద్యుత్‌ను ఫ్రీగా దళితులకు ఇస్తున్నారు. ఇది 200యూనిట్లకు పెంచాలి. జిఓ1235 ఆధారంగా రెండు ఎకరాల భూమిని ప్రతి గ్రామంలో స్మశాన స్థలాలకు ఇవ్వాలి.

ప్రభుత్వ రంగం వేగంగా తగ్గిపోతున్నది. ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్లు లేవు. బ్యాక్‌లాక్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు. దళిత ప్రజలు సాంఘిక సంక్షేమ పథకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉపాధి హామీ చట్టం, ప్రజా పంపిణీ, ఆహార భద్రత, ఆసరా ఫించన్స్‌, ఇవి కొంత మేరకు దళిత సమాజానికి ఉపయోగపడు తున్నాయి. ఈ తరుణంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు వల్ల సాంఘిక సంక్షేమ పథకాల లక్ష్యం నిరంతరం తగ్గించబడుతున్నది. నిత్యవసర సరుకుల ధరలు నిత్యం పెరుగు తున్నాయి. అర్థాకలితో జీవిస్తున్నారు. దళిత వాడల్లో రక్షిత తాగునీరు, రోడ్లు ఉండవు. గృహవసతి లేనివారు 30 శాతం ఉన్నారు. గృహ నిర్మాణ పథకం, డబల్‌ బెడ్రూం పథకాలు ఇండ్ల సమస్యను పరిష్కరించలేదు. కులాంతర వివాహాలు, కళ్యాణలక్ష్మీ పథకాలకు నిధులను పెంచాల్సిన అవసరం ఉంది. దళితుల సమగ్రాభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News