పెండింగ్‌లో 301 ఫిర్యాదులు.. 30 రోజులు దాటినవి 149.
గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు.
నల్లగొండ,: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. వచ్చే వారం నాటికి పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల్లో కనీసం 75 శాతం పరిష్కరించాలని స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 301 ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో వచ్చే వారంలోగా 200 ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. ఆ తర్వాతి వారానికి మిగిలిన మరో 100 ఫిర్యాదులను పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 149 ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్లతో ప్రత్యేకంగా సమీక్షించి, ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను పరిశీలించాలని సూచించారు.ఈ సోమవారం ప్రజావాణిలో మొత్తం 85 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి