రూ.20 లక్షల బీమా, వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల సాధన
ఎవరూ సమ్మె బాట పట్టవద్దు: ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు మైముద
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఇప్పటికే కమిషనర్, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆ కృషి ఫలితంగానే ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ.20 లక్షల బీమా సౌకర్యంతో పాటు వేతనంతో కూడిన మెటర్నటీ (ప్రసూతి) సెలవులను మంజూరు చేసిందని ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు మైముద తెలిపారు. భవిష్యత్తులో కూడా మిగిలిన ప్రధాన డిమాండ్లను ఐక్యంగా పోరాడి సాధించుకుందామని ఆమె పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతిపక్షాల మాటలు విని ఆశా వర్కర్లు ఎవరూ కూడా సమ్మె బాట పట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మన సమస్యల పట్ల సానుకూలంగా ఆలోచిస్తోందని, దానికి సహకరిస్తూ సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. ఎవరి ప్రలోభాలకు, కుట్రలకు బలికాకూడదని హితవు పలికారు.గత 20 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో, కమిషనర్ ముష్రఫ్ ఆలీ ప్రత్యేక చొరవతో బీమా సౌకర్యంతో పాటు మరికొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరబోతున్నాయని మైముద పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు అందరూ కొంత సమయం, సహనం పాటించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, 'ఐకమత్యమే మన బలం - ఐకమత్యమే మన ఆయుధం' అని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఆశా వర్కర్లకు బీమా సౌకర్యం, ప్రసూతి సెలవులు ప్రకటించడం పట్ల ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షురాలు ఫరహత్, ఉపాధ్యక్షురాలు అనిత, జ్యోతి, సభ్యులు మీనా, శ్రీలత, వెన్ రెడ్డి వనిత, సుగుణ, బాలశ్రీ, అమల, అమృత, భాగ్య, బద్రి రేణుక, చంద్రకళ, సరిత, శోభ తదితరులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి