సంయుక్త ప్రకటన విడుదల.. పిల్లల బాధ్యతలు ఇద్దరివే.. గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజెనోవా) విడిపోవాలని నిర్ణయించుకోవడం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఇద్దరూ పరస్పర అంగీకారంతో సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
తమ జీవిత ప్రయాణంలో ఎంతోకాలం కలిసి సాగిన అనంతరం పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వివాహ బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని, పిల్లల సంతోషం, భవిష్యత్తు, సంక్షేమం కోసం తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను కలిసే నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు.
ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలను కోరారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ వర్గాలు కూడా సంయుక్త ప్రకటన వాస్తవమేనని ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
పవన్ కల్యాణ్ మూడు వివాహాలు..
పవన్ కల్యాణ్ 1997లో నందినిని వివాహం చేసుకోగా, 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2009లో నటి రేణూ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు సంతానం. 2012లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 2013లో అన్నా లెజెనోవాను వివాహం చేసుకున్నారు. వీరికి పోలెనా అంజన పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మూడో వివాహ బంధానికి కూడా ముగింపు పలుకుతున్నట్లు ప్రకటన వెలువడటంతో పవన్ అభిమానుల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి