మల్లన్నకు తప్పిన ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు.
మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం సమీపంలో శుక్రవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లన్నకు పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం. అయితే కారు డ్రైవర్ బన్నీ, మల్లన్న సన్నిహితుడు రంగన్న తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మల్లన్న కారును ఢీకొట్టిన అనంతరం లారీ మరో కారును కూడా ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా, వారితో ఉన్న చిన్నారికి ప్రమాదం తప్పినట్లు తెలిసింది.
కాగా, రెండు రోజుల క్రితమే టీఆర్పీ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ సర్పంచ్‌తో వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రమాదంపై టీఆర్పీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం రోడ్డు ప్రమాదమేనా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర కోణం ఉందా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
అయితే కుట్రకు సంబంధించిన ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు వెలుగులోకి రాలేదు. ప్రమాదానికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి