దిల్‌సుఖ్‌నగర్ బస్సు డిపోలో డ్రైవర్లు, సిబ్బందికి అవగాహన సదస్సు
హైదరాబాద్ (మలక్‌పేట్), నవంబర్ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గురువారం దిల్‌సుఖ్‌నగర్ నగర బస్సు డిపోలో ‘క్షేమంగా గమ్యానికి చేరండి’ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డెల్టా-29 అధికారి కె. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 60 నుంచి 80 మంది ఆర్టీసీ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు. వాహనదారులు లేన్ క్రమశిక్షణ పాటించాలని, ఇతర వాహనాలను అధిగమించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను బాధ్యతగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి