తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజేయూ) ఆధ్వర్యంలో నవంబర్ 11న హైదరాబాద్‌లో నిర్వహించనున్న 10వ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనుస్లకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా శుక్రవారం టీయూడబ్ల్యూజేయూ జహీరాబాద్ శాఖ నాయకులు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్లను వేర్వేరుగా కలిసి ఆహ్వాన పత్రాలు అందజేశారు. అనంతరం వారి చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల సాధన కోసం యూనియన్ చేస్తున్న కృషికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ మైనార్టీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఉర్దూ పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిలో జర్నలిస్టుల సూచనలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. నవంబర్ 11న నిర్వహించే 10వ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేయూ జహీరాబాద్ శాఖ నాయకులు, వివిధ ఉర్దూ పత్రికల విలేకరులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజేయూ 10వ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి