హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ గిరిజన సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ గిరిజన సమాఖ్య రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉమ్మడి కమిషన్ ఉండటంతో గిరిజనుల సమస్యల పరిష్కారంలో సాంకేతిక, పరిపాలనాపరమైన జాప్యం జరిగేదని పేర్కొన్నారు. ఎస్టీల కోసం ప్రత్యేకంగా స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల గిరిజనుల హక్కుల పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గిరిజనుల సంక్షేమం, విద్య, ఉద్యోగ అవకాశాలు, సామాజిక హక్కుల పరిరక్షణకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. దశాబ్దాలుగా గిరిజన సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను గుర్తించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి గిరిజన సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
నూతనంగా ఏర్పాటు కానున్న ఎస్టీ కమిషన్ ద్వారా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని, గిరిజనుల హక్కులకు మరింత భరోసా కలుగుతుందని రమావత్ సక్రు నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి