తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఆందోల్ నియోజకవర్గ స్థాయి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని చౌటకూరు మండలం తాడ్దాన్‌పల్లిలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి మంత్రి దామోదర్ రాజనర్సింహకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆందోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సుమారు రూ.3 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాయకులు, కార్యకర్తలకు వివరించారు. రహదారుల నిర్మాణం, ఆసుపత్రుల అభివృద్ధి, నర్సింగ్ కళాశాల, వసతి గృహాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల అభివృద్ధితో పాటు వివిధ విద్యాసంస్థల్లో సీఎస్‌ఆర్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్‌లు, బస్సులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఆందోల్‌లో క్రీడా మైదానం అభివృద్ధి, గిరిజన న్యాయ కళాశాల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జోగిపేట–ఆందోల్ పట్టణాలను అనుసంధానించే వంతెనల నిర్మాణం, సింగూరు ప్రాజెక్టు వెనుక జలాల పరిసర ప్రాంతాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, పీసీసీ సభ్యుడు కిషన్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ చైర్మన్ సురేందర్ గౌడ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, సేవాదళ్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కార్మిక సంఘాలు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సహకార సంఘాల మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆందోల్‌లో పండుగ సందడి.. మంత్రి దామోదర్ రాజనర్సింహకు శుభాకాంక్షల వెల్లువ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి