జిల్లాలో రోడ్డు ప్రమాదాలను, ప్రమాద మరణాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రమాద రహిత జిల్లా లక్ష్యంగా చేపట్టిన జీరో ఫటాలిటీ డిస్ట్రిక్ట్ (ZFD) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి జాతీయ రహదారి 65పై పటాన్చెరు నుంచి దిగ్వాల్ కూడలి వరకు పర్యటించి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని అధికారులకు సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ఎత్తైన విద్యుద్దీపాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పటాన్చెరు బస్టాప్ వద్ద పాదచారుల వంతెన ఏర్పాటు చేయాలని, కంది చౌరస్తా వద్ద రహదారి అంచులు స్పష్టంగా కనిపించేలా గుర్తులు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, బస్సుల నుంచి దిగే ప్రయాణికులు సురక్షితంగా రహదారిని దాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.అలాగే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు, వేగాన్ని గుర్తించే పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకర మలుపులు, ఇరుకైన రహదారుల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, వాహనదారులు వేగ నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు, రవాణా, జాతీయ రహదారులు, రహదారులు–భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను తగ్గించాలని తెలిపారు. వాహనదారుల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచడంతో పాటు, ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశీలనలో గుర్తించిన లోపాలను త్వరితగతిన పరిష్కరించి, చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితా దేవి, రహదారులు–భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు రవీందర్, జిల్లా రవాణా అధికారి వాసు, ఏఎంవీఐ గౌతమ్, సంగారెడ్డి, పటాన్చెరు పోలీసు అధికారులు, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు.. ప్రమాద ప్రాంతాలపై కలెక్టర్, ఎస్పీ పరిశీలన
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి