యునెస్కో గుర్తింపు దిశగా కృషి చేస్తా... మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాంతి, నీడల సమన్వయంతో శివలింగంపై నిరంతర ఛాయ ప్రాచీన శిల్పకళకు అద్భుత నిదర్శనం...
నల్గొండ : నల్లగొండ జిల్లా పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతోపాటు, యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా సాధించే దిశగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
ప్రాచీన నిర్మాణ విజ్ఞానానికి ప్రతీక...
పానగల్ ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. వందల ఏళ్ల క్రితమే అప్పటి శిల్పులు కాంతి, నీడ, నిర్మాణ శాస్త్రాలను సమన్వయం చేస్తూ శివలింగంపై నిరంతరం ఛాయ కనిపించేలా ఆలయాన్ని నిర్మించడం విశేషమన్నారు. ప్రాచీన భారతీయ నిర్మాణ నైపుణ్యానికి, తెలంగాణ శిల్పకళా వైభవానికి ఈ ఆలయం అద్భుత నిదర్శనమని వివరించారు. ఇలాంటి అపురూపమైన చారిత్రక కట్టడాలను పరిరక్షించడంతోపాటు, వాటి విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ ప్రాశస్త్యాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, దేశవిదేశాల నుంచి పర్యాటకులు, భక్తులు తరలివచ్చేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు.
సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు...
ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చారిత్రక వారసత్వ సంపదను కాపాడటం, ప్రముఖ ఆలయాలకు పర్యాటక ప్రాధాన్యాన్ని పెంచడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
భక్తుల్లో హర్షాతిరేకాలు...
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు కావడంపై భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులతో ఆలయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తే నల్లగొండ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతోపాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి