కాంగ్రెస్ అగ్రనేత,మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీవిత ప్రయాణం,దేశానికి ఆమె చేసిన సేవలు,గాంధీ కుటుంబ త్యాగాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ పేరును జగ్గారెడ్డి, హరిప్రసాద్ ఎంపిక చేశారు.గతంలో ,ఓనమాలు,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.ఈ నేపథ్యంలో డిసెంబర్ 10వ తేదీ నుంచి జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని స్వయంగా కలిసి సినిమా నిర్మాణానికి ఆమె అనుమతి తీసుకోనున్నారు.సోనియా గాంధీ రచించిన 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' అనే ఆత్మకథ పుస్తకంలోని ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించనున్నారు.సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ప్రేమ ప్రయాణం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల బలిదానాలు,దేశం కోసం వారు చేసిన త్యాగాలు,వారి మరణానంతరం సోనియా గాంధీ ఎదుర్కొన్న పరిస్థితులు, దేశ ప్రజల కోసం ఆమె చేసిన సేవలను సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు.అలాగే ప్రజాసేవ కోసం సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తీరు, ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప నిర్ణయం, పేద ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలు, దేశ రాజకీయాల్లో ఆమె పోషించిన పాత్రను ప్రేక్షకులకు అర్థమయ్యేలా వెండితెరపై ఆవిష్కరించనున్నారు.ఈ సినిమా నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాలు లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం తీసుకోకుండా, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో ప్రత్యేక ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేసి, వారి సహకారంతో తామే సినిమాను నిర్మిస్తామని వెల్లడించారు. సోనియా గాంధీ జీవిత ప్రయాణం, గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు, ప్రజాసేవలో వారి పాత్రను దేశ, విదేశాల్లోని ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజేయడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని జగ్గారెడ్డి తెలిపారు. సోనియా గాంధీ అనుమతి లభించిన అనంతరం సినిమా నిర్మాణానికి సంబంధించిన తదుపరి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
సోనియా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా.. నిర్మాణానికి సిద్ధమైన జగ్గారెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి