నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకంలో భాగంగా మండలానికి మంజూరైన 307 పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో చేయూత పింఛన్లు మంజూరు కావడం, నారాయణఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధిక పింఛన్లు రావడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నిరుపేదలకు పింఛన్లు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని పేర్కొన్నారు. మానూర్ మండలానికి 307 పింఛన్లు మంజూరు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు పెట్టుబడి సాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్య సేవలు, మహిళా సంఘాలకు రుణాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి పథకాలతో ప్రజలకు మేలు కలిగిస్తోందని వివరించారు. అలాగే మానూర్ మండలంలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇంకా ఎవరైనా అర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటే వారిని గుర్తించి నిబంధనల ప్రకారం పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పింఛన్ల లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. లబ్ధిదారులకు పింఛన్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి