భగత్‌సింగ్ ఆశయాలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి
భువనగిరి: భగత్‌సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత కృషి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్ పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో సోమవారం భగత్‌సింగ్ 119వ జయంతి సందర్భంగా ‘రాజ్యాంగ పరిరక్షణ–డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువత’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. తొలుత భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్‌సింగ్ 119వ జయంతి సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా నిర్వహించినట్లు ఆకాశవాణి కూడా పేర్కొంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తిని అలవర్చుకున్నారని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు సామాజిక సమస్యలపై చైతన్యంతో ముందుకు రావాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు ప్రజాస్వామ్యానికి కీలకమని పేర్కొంటూ, ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం పారదర్శకంగా సమాధానాలు ఇవ్వాలని కోరారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ తరఫున డిమాండ్ చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌పై వివిధ వర్గాల నుంచి రాజీనామా డిమాండ్లు వస్తున్న విషయం ప్రస్తుత రాజకీయ పరిణామాల్లోనూ నమోదైంది.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య హక్కులు, ఓటు హక్కు పరిరక్షణ కోసం యువత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు.
కార్యక్రమంలో సాయి కృప కళాశాల కరస్పాండెంట్ ధర్పల్లి ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు శ్రావణ్‌రెడ్డి, శైలజ, విద్యార్థులు ఝాన్సీ, ప్రవళిక, రేవతి, సంధ్య, సంజన, సరిత, నందిని, మానస, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి