భువనగిరి: 700 సర్వే నంబర్‌లో పట్టా సర్టిఫికెట్లు పొందిన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించకుంటే తిరిగి గుడిసెలు వేసి ఆందోళన చేపడతామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ హెచ్చరించారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టా సర్టిఫికెట్లు పొందిన లబ్ధిదారులు, పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. 2005లో భువనగిరి పట్టణ శివారులోని ముగ్ధంపల్లి మార్గంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని పోరాటం చేయగా 107 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటివరకు వారికి స్థలాలు చూపించలేదన్నారు. ఏడాది కాలంగా దశలవారీగా ఆందోళనలు చేపట్టడంతో అధికారులు సర్వే నిర్వహించి హద్దురాళ్లు ఏర్పాటు చేశారని, ప్లాట్లను చదును చేసి ఇస్తామని హామీ ఇచ్చినా ఏడు నెలలుగా అమలు చేయలేదని పేర్కొన్నారు.
పట్టా సర్టిఫికెట్లు పొందిన 107 మందితోపాటు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ప్లాట్లు ఏర్పాటు చేసి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2008లో సర్వే నంబర్ 107లో స్థలాలు చూపించిన వారికి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, భూమి వివాదంతో నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపారు. కోర్టు కేసు సమస్యను పరిష్కరించి ఇళ్ల నిర్మాణాలకు అవకాశం కల్పించాలని కోరారు. సర్వే నంబర్ 649లో పట్టా సర్టిఫికెట్లు పొందిన వారికి కూడా స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు.
పట్టణ కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలతోపాటు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
కార్యక్రమానికి గంధమల్ల మాతయ్య అధ్యక్షత వహించగా పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు, నాయకులు వల్దా అంజయ్య, నరాల నరసింహ, కొత్త లక్ష్మయ్య, కొత్త లలిత, మన్నె రాజు, భూపోరాట కమిటీ సభ్యులు నారకాలమ్మ, ఇక్కుర్తి కళావతి, దొడ్డి శంకర్, పిట్టల చంద్రశేఖర్, ఎండీ ఆరిఫా, ఎండీ రేష్మ, గుండెగల భారతమ్మ, కృష్ణవేణి, ఆడెపు మౌనిక, పల్దా జంగమ్మ, డప్పు వసుంధర తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి