భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని PM శ్రీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) న్యాల్కల్లో విద్యార్థినులు రంగురంగుల రంగోలీల ద్వారా భారత రాజ్యాంగ గొప్పతనాన్ని చాటిచెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను తమ సృజనాత్మకతతో రంగోలీల రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. భారత రాజ్యాంగం, జాతీయ జెండా, ధర్మచక్రం, జాతీయ చిహ్నం, న్యాయవ్యవస్థ, మహిళా సమానత్వం, మత స్వేచ్ఛ, ఓటు హక్కు, వ్యవసాయం, రైతుల ప్రాధాన్యత, శాస్త్రీయ అభివృద్ధి వంటి అనేక అంశాలను రంగోలీలలో అందంగా చిత్రీకరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారి లలిత విద్యార్థినుల ప్రతిభను అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవంగా జీవించే అవకాశాన్ని కల్పించిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని తెలిపారు. కుల, మత, భాష, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలనే గొప్ప సందేశాన్ని విద్యార్థినులు తమ రంగోలీల ద్వారా చక్కగా తెలియజేశారని ప్రశంసించారు. ముఖ్యంగా రైతుల కష్టం, మహిళల హక్కులు, మత స్వేచ్ఛ, ఓటు హక్కు వంటి అంశాలను రంగోలీలలో చూపించడం అభినందనీయమన్నారు. పుస్తకాల్లో చదివిన రాజ్యాంగ విలువలను కళారూపంలో ప్రదర్శించడం విద్యార్థినుల అవగాహన, సృజనాత్మకతకు నిదర్శనమని పేర్కొన్నారు. రేపటి భారతదేశాన్ని నిర్మించేది నేటి విద్యార్థులేనని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా తెలుసుకుని సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి విలువలను జీవితంలో పాటించాలని సూచించారు. విద్యార్థినులు ప్రదర్శించిన ఈ ప్రతిభను చూసి ప్రత్యేక అధికారిగా ఎంతో గర్వంగా ఉందని అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడంతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యత, సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమంగా నిలిచింది.
రంగోలీలతో రాజ్యాంగ గొప్పతనాన్ని చాటిన న్యాల్కల్ KGBV విద్యార్థినులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి