తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన భవనం ప్రారంభం.
డ్వాక్రా సంఘాలకు రూ.30 కోట్లు.. చేనేత, డెయిరీ రంగాలకు రుణాలు.
స్థానికం ప్రతినిధి | భువనగిరి, నవంబర్ 4:
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల ఆర్థిక పురోగతే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు వివిధ రంగాలకు రుణాలు అందిస్తోందని బ్యాంకు చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి తెలిపారు. బుధవారం భువనగిరిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖ నూతన భవనాన్ని చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్ అతుల్ శ్రీవాస్తవ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎం. ఉదయ్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల పరిధిలో బ్యాంకుకు 48 శాఖలు ఉన్నాయని వివరించారు. ఈ నెలలో డ్వాక్రా సంఘాలకు రూ.30 కోట్లు, చేనేత కార్మికులకు రూ.2 కోట్లు, డెయిరీ రంగ రైతులకు రూ.2 కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడించారు. రుణమేళాలో భాగంగా 20 మంది లబ్ధిదారులకు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు, వాహనాల కొనుగోలుకు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
బ్యాంకు అందిస్తున్న రుణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చైర్మన్ కె. ప్రతాప్‌రెడ్డి కోరారు. విజయ డెయిరీ భాగస్వామ్యంతో రైతులకు రుణాలు అందిస్తూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. రుణాలు పొందిన వారు వాటిని సక్రమంగా వినియోగించుకొని సకాలంలో తిరిగి చెల్లించాలని చీఫ్ జనరల్ మేనేజర్ అతుల్ శ్రీవాస్తవ సూచించారు.
నూతన భవనం ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఎం. ఉదయ్, చీఫ్ మేనేజర్ పి. రాంచంద్రారెడ్డి, సీనియర్ మేనేజర్ ఎం. మురళీకృష్ణ, బ్రాంచ్ మేనేజర్ ఎన్. అన్వర్ లాల్, హబ్ మేనేజర్ జి. నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి