పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ సూచించారు.
భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్‌లో శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, గచ్చిబౌలి స్టార్ హాస్పిటల్ సహకారంతో 146వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 200 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా పల్మనాలజిస్ట్ డాక్టర్ పెద్ది శ్రీకాంత్, కార్డియాలజిస్ట్ డాక్టర్ చక్రధర్, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చావా రాజ్ కుమార్, డెంటల్ సర్జన్ డాక్టర్ చావా అశ్లేష ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, పీఎఫ్‌టీ పరీక్షలను ఉచితంగా చేసి, వైద్యుల సూచన మేరకు మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా డాక్టర్ చావా రాజ్ కుమార్ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.
డాక్టర్ చావా రాజ్ కుమార్ మాట్లాడుతూ వైద్య శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్న ప్రజలకు, సిబ్బందికి, స్టార్ హాస్పిటల్ వైద్యులు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవాయిస్ చిస్తే, డీఎస్పీ రవీందర్, 30వ వార్డు కౌన్సిలర్ లైక్ అహ్మద్, టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్టార్ హాస్పిటల్ సీబీఓ అయూబ్, పీఆర్వో ఖాజారావు, శ్రీ ఆర్కే హాస్పిటల్ ఇన్‌చార్జి కొండల్ రెడ్డి, పడిగేం శంకర్ తదితరులు శిబిరం నిర్వహణలో సహకరించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి