సంవత్సరమంతా కష్టపడి పత్తి పంటను సాగు చేసి, అమ్ముకునేందుకు వెళ్లిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో ఉన్న రామ్ శ్రే కాటన్ (ప్రైవేట్) లిమిటెడ్ మిల్లులో పత్తి కొనుగోలు విధానంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పత్తి విక్రయించేందుకు వెళ్లిన ఇబ్రహీంపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులకు చేదు అనుభవం ఎదురైందని తెలిపారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తి కొనుగోలు ప్రారంభంలో ఒక ధర చెబుతూ, పత్తి కొంతమేర కొనుగోలు చేసిన తర్వాత నాణ్యత సరిగా లేదని, తేమ ఎక్కువగా ఉందని, తూకం, కొలతలు, తరుగు తదితర కారణాలు చూపిస్తూ ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మిల్లు యాజమాన్యం, నిర్వాహకుల తరఫున శివాజీ అనే వ్యక్తి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితి పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతోందని, ఏడాది పొడవునా కష్టపడి పంట పండించి అమ్ముకునే సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రామ్ శ్రే కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు విధానంపై సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. తూకం, తేమ శాతం, తరుగు, ధర నిర్ణయించే విధానాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మిల్లు యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
పంట పండించిన రైతుకు కష్టాలే మిగిలాయా? మిల్లు కొనుగోళ్లపై ఆరోపణలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి