జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ
తరగతులను జయప్రదం చేయాలి: జిల్లా అధ్యక్షుడు పెంటయ్య, కార్యదర్శి నర్సింహ
భువనగిరి, నవంబర్ 25: స్థానికం ప్రతినిధి:
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 4, 5 తేదీల్లో భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య, ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలిపారు. ఈ రెండు రోజుల కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, సరళీకరణ విధానాల ప్రభావంతో వ్యవసాయ రంగం దెబ్బతింటోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుపేదలకు ఆదాయ, ఆహార భద్రత కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న భూమి, కూలీ, విద్య, వైద్యం, ఉపాధి సమస్యలపై శిక్షణా తరగతుల్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమాలు, పోరాటాల కార్యాచరణను రూపొందించనున్నట్లు వివరించారు.
శిక్షణా తరగతులను విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజలు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు సహకరించాలని జల్లెల పెంటయ్య, కొండమడుగు నర్సింహ కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి