విద్యార్థుల భద్రత, బాలల హక్కులు, వ్యక్తిగత రక్షణపై అవగాహన కల్పించేందుకు జోగిపేటలోని సెయింట్ డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోగిపేట ఎస్ఐ గిరి శ్రీకాంత్ తన పోలీసు బృందంతో హాజరై విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రెవ. ఫాదర్ ఎన్. సురేష్ పోలీసు బృందానికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎస్ఐ గిరి శ్రీకాంత్ మాట్లాడుతూ బాలల హక్కులు, పోక్సో చట్టం, వ్యక్తిగత భద్రత, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధానాలను వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణ, సమయపాలన, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని హితవు పలికారు.అనంతరం పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రెవ. ఫాదర్ ఎన్. సురేష్ మాట్లాడుతూ విద్య అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలు, మార్కులకే పరిమితం కాదని, విద్యార్థులను మంచి వ్యక్తులుగా, బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడం కూడా విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రెవ. ఫాదర్ సిబి, అడ్మినిస్ట్రేటర్ రెవ. ఫాదర్ ఎన్. సురేష్, ప్రిన్సిపాల్ జిన్సీ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు విలువైన సూచనలు అందించిన ఎస్ఐ గిరి శ్రీకాంత్, పోలీసు బృందానికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
పిల్లల భద్రతే ముఖ్యం.. పాఠశాలలో పోలీసుల అవగాహన
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి