రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాక్టర్ చోరీ కేసును పోలీసులు కేవలం ఎనిమిది గంటల్లోనే ఛేదించారు. దొంగిలించబడిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. రాయికోడ్ గ్రామానికి చెందిన హల్బెర్గె చంద్రశేఖర్ తండ్రి శివప్పకు చెందిన మహీంద్రా యువ 575 మోడల్ ఎరుపు రంగు ట్రాక్టర్ (నంబర్ TS17 4674)ను ఈ నెల 16వ తేదీ రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 17వ తేదీన రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ట్రాక్టర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి సుమారు 11:30 గంటలకు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం నారాయణరావుపేట సమీపంలోని తండా వద్ద దొంగిలించబడిన ట్రాక్టర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి పాల్పడిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తీరత్ ఠాకూర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేవలం ఎనిమిది గంటల్లోనే చోరీ కేసును ఛేదించి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బందిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
ఫిర్యాదు అందిన వెంటనే స్పందన.. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి