నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం.
జిల్లాలో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా పక్కా ఆధారాలను సేకరించాలని సూచించారు. పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈ-సాక్ష్య యాప్‌ను ప్రతి దర్యాప్తు అధికారి తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు. సీసీటీఎన్ఎస్, ఈ-సాక్ష్య వ్యవస్థల ద్వారా కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. బీట్ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తూ సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పట్టణాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును విస్తృతం చేయాలని, ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు.
పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇసుక అక్రమ మైనింగ్, పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు, నిత్యావసర వస్తువుల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల ఫిర్యాదులను సానుకూలంగా స్వీకరించి, చట్టపరిధిలో సత్వర న్యాయం అందించాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల ఛేదన, కేసుల దర్యాప్తు, కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివరాం రెడ్డి, శ్రీనివాస్ రావు, లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు, సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి