సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంతో పాటు సిరూర్, దౌల్తాబాద్ గ్రామాల్లో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. ఆంజయ్య, తహశీల్దార్ ఆశాజ్యోతి, గ్రామ సర్పంచ్ బి. రాధా తుకారం, ఉపసర్పంచ్ ఆర్. శివకుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పి. కేదారినాథ్ పటేల్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేందుకు కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా ఉపయోగపడుతుందని వివరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. ఆంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తోందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడంలో రేషన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కొత్తగా అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో సులభంగా భద్రపరుచుకునే విధంగా ఉన్నాయని, భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ రేషన్ కార్డులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం:జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. ఆంజయ్య
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి