గోసంరక్షణకు పోలీసు శాఖ పూర్తి సహకారం: ఏసీపీ రాజు
రంగారెడ్డి జిల్లా, నవంబర్ 17: స్థానికం ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో గోవుల సంరక్షణ, గోశాలల పరిరక్షణ కోరుతూ నిర్వహించిన ‘గో సడక్ బంద్’ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైతులు, గోసంరక్షకులు, గోప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కార్యక్రమం సందర్భంగా మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి గోశాలల్లోని పరిస్థితులను పరిశీలించారు. ఇంటర్మ్ కస్టడీలో ఉన్న సుమారు 300కు పైగా ఆవులు, దూడలు, ఎద్దుల సంరక్షణకు అవసరమైన పశుగ్రాసం, తాగునీరు, విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలకు విరుద్ధంగా తరలించే వాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లా వెటర్నరీ అధికారి అంకం రాజు, వైద్యుల బృందం పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించింది.
వారం రోజుల్లో గోశాలల సందర్శన
గోశాలల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు కె. శివకుమార్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో గోశాలలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తామని వెల్లడించారు.
గోవుల సంరక్షణ, గోశాలల సమస్యల పరిష్కారం, అక్రమ రవాణా నిరోధం, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తాయని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపారు. కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి