జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు...
500 మందికి నల్లగొండ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచిత వసతి, భోజనం..
ఈ నెల 20న స్క్రీనింగ్ టెస్ట్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ త్వరలో చేపట్టనున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ), పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు పోటీ పడే నిరుద్యోగ యువత కోసం నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈ వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన 500 మంది యువతీ యువకులను ఎంపిక చేసి, నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తామన్నారు.
శిక్షణలోని ప్రధాన అంశాలు..
అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యంలో రాత పరీక్ష సిలబస్‌పై ప్రత్యేక బోధన, క్రమం తప్పకుండా మాక్ టెస్టులు, పరీక్షా విధానంపై అవగాహనతో పాటు శారీరక దారుఢ్య శిక్షణ (ఫిజికల్ ట్రైనింగ్) అందిస్తామని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్లలోనూ మెరుగైన ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతామన్నారు.
స్క్రీనింగ్ టెస్ట్ వివరాలు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్ ఫామ్ (https://forms.gle/Ha8ZK33Y1emVCKmx6) లింక్ ద్వారా ముందస్తుగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ నెల 20న (ఆదివారం) ఉదయం 9:00 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ ఎస్ఐ/కానిస్టేబుల్ అప్లికేషన్ (Part-I Application Form) ప్రతిని తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.
సబ్ డివిజన్ల వారీగా పరీక్షా కేంద్రాలు..
- నల్లగొండ సబ్ డివిజన్: ఎన్.జి. కళాశాల, నల్లగొండ.
- మిర్యాలగూడ సబ్ డివిజన్: మీనా ఇంజినీరింగ్ కళాశాల, మిర్యాలగూడ.
- దేవరకొండ సబ్ డివిజన్: కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (మీనాక్షి సెంటర్స్, డిండి క్రాస్ రోడ్).
పోలీస్ శాఖ కల్పిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో శ్రమించి ఉద్యోగం సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. సందేహాలు ఉన్నవారు తమ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి