మున్సిపల్ కార్యాలయం పక్కనే పగిలిన పైపులైన్.. రోజుల తరబడి వృథాగా పోతున్న తాగునీరు.
చిట్యాల: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న చిట్యాల మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కార్యాలయం పక్కనే వృథాగా పోతున్న నీటిని మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వార్డుల వారీగా సదస్సులు నిర్వహిస్తూ ప్రజలకు సూచనలు చేస్తున్న అధికారులు, ఆచరణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చిట్యాల మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న తాగునీటి పైపులైన్ పగిలిపోవడంతో గత కొన్ని రోజులుగా నీరు వృథాగా రోడ్డుపై పారుతోంది. కార్యాలయానికి నిత్యం రాకపోకలు సాగించే అధికారులు, సిబ్బంది కళ్ల ముందే నీరు వృథాగా పోతున్నా మరమ్మతులు చేపట్టకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.
ఓవైపు నీటి విలువను గుర్తించి ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్న మున్సిపల్ యంత్రాంగం.. మరోవైపు కార్యాలయం పక్కనే నీరు వృథా అవుతున్నా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయం పక్కనే పరిస్థితి ఇలా ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని మారుమూల వార్డుల్లో పైపులైన్లు పగిలి నీరు వృథా అవుతుంటే పట్టించుకునే వారెవరనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి