మిల్లుల కేటాయింపులూ లేవు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్న అన్నదాతలు ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతల మండిపాటు
స్థానికం ప్రతినిధి, భువనగిరి:
అన్నదాతకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కేంద్రాలకు గోనె సంచులు చేరకపోవడం, రైస్ మిల్లుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనాజీపూర్, నందనం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ జక్క రాఘవేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
దళారుల దోపిడీకి రైతులు బలి
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 20 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం సేకరణ మొదలుకాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. సరైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయి ఇప్పటికే నష్టపోయిన రైతులకు, ఇప్పుడు పండిన కొద్దిపాటి ధాన్యాన్ని అమ్ముకోవడంలోనూ ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులకు క్వింటాల్ ధాన్యాన్ని రూ.1,800 నుంచి రూ.1,900కే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు సరఫరా చేయడంతో పాటు రైస్ మిల్లులను కేటాయించి వెంటనే ధాన్యం సేకరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భువనగిరి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గోద శ్రీనివాస్ గౌడ్, కస్తూరి పాండు, నందనం సర్పంచ్ నాగేల్లి గిరిజ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, బాత్క అశోక్ యాదవ్, బొల్లేపల్లి మాణిక్యం, ఎలిమినేటి విఠల్ రెడ్డి, చింతల దేవేందర్ గౌడ్, బొల్లేపల్లి అశోక్, ఎదునూరి చంద్రయ్య, మొలుగు నాగరాజు, మట్ట బాలకృష్ణ గౌడ్, రైతులు ఎలిమినేటి మధుసూదన్ రెడ్డి, రెడ్డి మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి