మహిళల భద్రతకు ముప్పుగా మారుతున్న మద్యం విక్రయాలు
ఎక్సైజ్, పోలీసు శాఖలు చర్యలు తీసుకోవాలి.
చిట్యాల మున్సిపాలిటీ నాలుగో వార్డులో కొనసాగుతున్న మద్యం బెల్టు షాపులను నియంత్రించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఐద్వా చిట్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై వెంకట్ రెడ్డి కమిషనర్ గురులింగం ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు జిట్ట సరోజ మాట్లాడుతూ.. నాలుగో వార్డులో మద్యం బెల్టు షాపుల నిర్వహణతో మహిళలు, యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విక్రయాల కారణంగా కుటుంబాల్లో కలహాలు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం మత్తులో కొందరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బెల్టు షాపుల వల్ల యువత చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాలుగో వార్డులో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపే వారిపై ఎక్సైజ్, పోలీసు శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కడగంచి అండాలు, ఎం.డి. సలీమా, కె. సుజాత, ఆర్. అండాలు, ఎం. జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి