మండల స్థాయిలో నిర్వహించిన ఆంగ్ల భాషా పోటీల్లో బోరంచ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాలు సాధించారు. జిల్లా ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ మానూర్ పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలను ఎంఈఓ రాజశేఖర్ ప్రారంభించారు. ఈ పోటీల్లో బోరంచ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బి. వైష్ణవి సీనియర్ విభాగంలో టెడ్ఎక్స్ ప్రసంగ పోటీలో ప్రథమ స్థానం సాధించగా, 6వ తరగతి విద్యార్థిని వై. అక్షయ జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. విద్యార్థులు తమ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ హాజరై విద్యార్థులను అభినందించారు.ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, మాట్లాడే సామర్థ్యం పెరుగుతాయని సూచించారు. ఈ సందర్భంగా బోరంచ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ స్వామి విద్యార్థులు సాధించిన విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, విజేతలైన విద్యార్థులతో పాటు వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయురాలు అనూషను ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయుల కృషి, ప్రోత్సాహంతోనే విద్యార్థులు ఇలాంటి విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. బోరంచ విద్యార్థులు రెండు విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుల కృషిని పలువురు అభినందించారు.
మండల స్థాయి ఆంగ్ల భాషా పోటీల్లో బోరంచ విద్యార్థుల విజయభేరి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి